Women’s World Cup 2025: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. విజయవాడలో భారీ LED స్క్రీన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:18 PM
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఏపీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ సిద్ధం చేశారు. అక్కడ భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు
విజయవాడ నవంబర్ 1: మహిళల వన్డే ప్రపంచకప్2025 ఫైనల్ మ్యాచ్(Women’s World Cup 2025) కాస్తా ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. వర్షం కారణంగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన ఈ తుది పోరు ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తోంది. మ్యాచ్ ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీకి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అలానే చాలా మంది క్రికెట్ అభిమానులు పెద్ద పెద్ద స్క్రీన్లు వేసుకుని మ్యా్చ్ ను వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇక మ్యాచ్ ను చూసేందుకు దేశ వ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
ఏపీలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ సిద్ధం చేశారు. అక్కడ భారీ ఎల్‌ఈడీ స్క్రీన్(Vijayawada LED Screening)ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ దృష్ట్యా శాప్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ వద్ద ఎల్‌ఈడీ(LED) స్క్రీన్లు ఏర్పాటు చేసిందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు వెల్లడించారు. ఇండియా విజయం సాధించాలని దేశమంతా ఆకాంక్షిస్తోందని చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారత్ జట్టు గెలవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... ఇండియా , సౌతాఫ్రికా జట్లలో ఎవరు గెల్చిన చరిత్రే అవుతుంది. కారణం ఈ రెండు జట్లకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను ముద్దాడలేదు. మిథాలి రాజ్(Mithali Raj) సారథ్యంలో భారత్ రెండు సార్లు ఫైనల్ కు చేరినా.. కప్ ను మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈసారి హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) జట్టు కప్ గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. సెకండ్ సెమీ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపైన భారత్ జట్టు అద్భుత విజయం అందుకుంది. అదే స్ఫూర్తి, పట్టుదల ఫైనల్ మ్యాచ్ లో చూపిస్తే.. ప్రపంచ విజేతగా నిలవడం భారత్ కు పెద్ద కష్టమేమీ కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే
రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు