Water Resources Dept: కేంద్రం అభ్యంతరాలు అసంబద్ధం
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:52 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపుతూ ఈఏసీ చూపిన కారణాలు సహేతుకంగా లేవని జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తిగా ఉంది. తన పరిధి దాటి వ్యవహరించిందని గుర్రుగా ఉంది.
బనకచర్లకు కొర్రీలు వేయడంపై అసంతృప్తి
ద్విముఖ వ్యూహంతో ముందుకు.. ఈఏసీకి వరద లెక్కల సమర్పణ
గోదావరిలో గత 30 ఏళ్లలో కడలిపాలైన నీటి వివరాల సేకరణ
గతంలో కేసీఆర్, కేంద్రం తీసిన గణాంకాలు కూడా
చంద్రబాబు ఆదేశం.. కేంద్రం, తెలంగాణతో రాజకీయ చర్చలు
10 లేదా 11న కేంద్ర మంత్రులు నిర్మల, పాటిల్‌తో సీఎం భేటీ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌తోనూ సంప్రదింపులు!
ఇద్దరు సీఎంలతో భేటీ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపుతూ ఈఏసీ చూపిన కారణాలు సహేతుకంగా లేవని జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తిగా ఉంది. తన పరిధి దాటి వ్యవహరించిందని గుర్రుగా ఉంది. పర్యావరణ అనుమతుల నిమిత్తం అందిన ప్రాజెక్టు ప్రతిపాదనల్లో విధాన లోపాలేవైనా ఉన్నాయో లేవో పరిశీలించాల్సి ఉండగా.. తన అధికార పరిధిలో లేని వరద జలాల అందుబాటు, అంతర్రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించి తిప్పిపంపడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దాని నిర్ణయం వెనుక పాలనాపరమైన అంశాలు కాకుండా కాకుండా రాజకీయపరమైన ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈఏసీ వేసిన కొర్రీలకు సూటిగా జవాబివ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే.. కేంద్ర సంస్థల ఎదుట బలమైన వాదనలు వినిపించనుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత.. ముఖ్యంగా గోదావరిలో వరద జలాల అందుబాటుకు సంబంధించి జలసంఘంతో కలిసి తాజాగా అధ్యయనం చేయాలని ఈఏసీ సోమవారం ఏపీకి సూచించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇచ్చినా.. ఒడిసా, ఛత్తీస్‌గఢ్లలో ముంపు సమస్య కారణంగా ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిందని తెలిపింది.
ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనేక ఈ-మెయిల్స్ వచ్చాయని.. ఈ ప్రాజెక్టు గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించేలా ఉందని వాటి సారాంశమని.. అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఇమిడి ఉన్నందున ఈ సమస్యలను పరిష్కరించుకుని విధివిధానాల (టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్-టీవోఆర్) ఖరారుకు మళ్లీ తనకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంది. ఏటా గోదావరి వరద జలాలు అన్యాయంగా 3 వేల టీఎంసీలు సముద్రంపాలవుతున్నాయని.. వీటిలో 200 టీఎంసీలను.. అది కూడా వరద కాలంలోనే రోజుకు 2 టీఎంసీల చొప్పున వంద రోజులు తీసుకుని బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ వరకు తరలించి రాయలసీమకు అందించాలని సంకల్పించి ఈ ప్రాజెక్టు సిద్ధం చేశామని రాష్ట్రప్రభుత్వం తన ప్రతిపాదనల్లో స్పష్టంగా తెలియజేసింది. అయినా వరద జలాల అందుబాటుపై జలసంఘంతో కలిసి అధ్యయనం చేయాలని ఈఏసీ సూచించడంతో.. గోదావరి నీటి లెక్కలను ప్రభుత్వం మరోసారి బయటకు తీస్తోంది. ముఖ్యంగా గత 30 ఏళ్లలో ఏ ఏడాది ఎన్ని గోదావరి జలాలు కడలిపాలయ్యాయో ఈఏసీకి గణాంకాలు సమర్పించాలని భావిస్తోంది. ఈఏసీ నిర్ణయం వెలువడిన వెంటనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి లెక్కలు తీయాలని ఆదేశించారు. నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా మహానది-కావేరి పథకం ప్రతిపాదన వచ్చినప్పుడు తీసిన నీటి లెక్కలు.. తెలంగాణ భూభాగంలోని ప్రాణహిత నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం కోసం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన లెక్కలు.. గోదావరి-బనకచర్లకు అదే కేసీఆర్ తయారుచేసిన గణాంకాలు.. కేంద్ర జల సంఘం విడుదల చేసిన లెక్కల వివరాలు సిద్ధం చేయాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నిర్దేశించింది. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు.
ఇక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈఏసీకి అందిన ఫిర్యాదులన్నీ రాజకీయ కోణంలో ఉన్నందున.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. అటు కేంద్రంతోనూ రాజకీయ చర్చల ప్రక్రియ ద్వారా కూడా ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10 లేదా 11న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తో భేటీ కావాలని సీఎం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారితో చర్చల సందర్భంగా.. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా గురించి, సముద్రంలోకి వృధాగా పోయే జలాల్లో ఎగువ రాష్ట్రాలకు హక్కు ఉండదంటూ వివరించాలని ఆయన భావిస్తున్నారు. ఈ ద్విముఖ వ్యూహంతో ప్రాజెక్టుకు క్లియరెన్సు తెచ్చుకోగలమన్న ధీమా ఉన్నతాధికారుల్లో కనిపిస్తోంది. మరోవైపు.. ఈ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం కొద్దిరోజుల క్రితమే నిర్ణయించింది. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఇలా రాజకీయంగా సంప్రదింపులు జరుపుతూనే.. ఈఏసీ లేవనెత్తిన అంశాలపై ఘాటుగా స్పందించాలని జల వనరుల శాఖ భావిస్తోంది. నీటి లెక్కలను సమర్పించి బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాలని.. అటు కేంద్ర జలసంఘంపైనా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది..
అక్కడి అధికారులు అలా.. ఇక్కడి అధికారులు ఇలా..!
కేంద్ర జల సంఘంలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం జలవనరుల శాఖలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్న కారణంగా.. కేంద్ర జలశక్తి శాఖ వద్ద లాబీయింగ్ చేయగలుగుతున్నారని రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు తెచ్చేందుకు నిరంతరం జలశక్తి శాఖతో సంప్రదింపులు జరిపే అధికార వ్యవస్థే లేదని ఆక్షేపిస్తున్నారు. ‘జలవనరుల శాఖలోని అంతర్రాష్ట్ర జల వివాద విభాగంలో విధులు నిర్వహించే ఇంజనీరింగ్ అధికారులకు రాష్ట్రంపై అభిమానం.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్న తపన ఉండాలి. ఇక్కడ పనిచేయడం బరువుగా భావించేవారికి విధులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విభాగాన్ని ‘పనిష్మెంట్ వింగ్’గా జల వనరుల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు కూడా భావిస్తుండడంతో.. కేంద్ర శాఖలతో చర్చల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు’ అని అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు.. జలశక్తి శాఖ అధికారులతో సంప్రదింపులకు ఢిల్లీ వెళ్లేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ విమాన చార్జీలకూ నిధులివ్వడంలేదని జల వనరుల శాఖ అధికారులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, అధికార గణం నిత్యం ఢిల్లీలోని మంత్రులు, జలశక్తి అధికారులతో టచ్‌లో ఉంటూ లాబీయింగ్ చేస్తూ ఉంటే.. తమకు టికెట్లకే డబ్బులివ్వని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. దీనిపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈఏసీ క్లియరెన్సు.. బనకచర్ల ప్రాజెక్టు ప్రణాళిక ముందుకు వెళ్లేందుకు దోహదపడే ‘గేట్ పాస్‌గా వారు అభివర్ణిస్తున్నారు.
అధికారులతో సాయిప్రసాద్ భేటీ
సీఎంవో ఆదేశాలతో జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ మంగళవారం అత్యవసరంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నీటి లెక్కల కోసం జలసంఘంపై ఒత్తిడి తీసుకురావడం మంచిదన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. దాని నుంచి హైడ్రాలజీ క్లియరెన్స్ సాధిస్తే ఈఏసీ వద్ద గట్టిగా వాదనలు వినిపించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో పర్యావరణ అనుమతుల కోసం సమాంతరంగా ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించారు.