Badvel Mishap: మృత్యు శకటం
ABN , Publish Date - May 25 , 2025 | 05:51 AM
కడప జిల్లా బద్వేలు ఘాట్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగి ఉన్న కారుపై దూసుకెళ్లడంతో నాలుగుగురు మృతి చెందారు. మృతుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన దంపతులు, అక్కాతమ్ముడు ఉన్నారు.

బ్రేక్ ఫెయిలై ఆగి ఉన్న కారుపైకి దూసుకొచ్చిన లారీ
నలుగురు దుర్మరణం.. ఆలయ మండల పూజకు వస్తుండగా దారుణం
మృతుల్లో టెకీ దంపతులు, అక్కాతమ్ముడు
బద్వేలు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సీకేదిన్నె, మే 24 (ఆంధ్రజ్యోతి): సొంతూరిలో ఆల య మండల పూజలో పాల్గొనడంతోపాటు, కుమార్తె పుట్టుతల తీయించేందుకు సంతోషంగా కారులో బయలుదేరినవారిపైకి మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఆగి ఉన్న కారుపైకి లారీ పూర్తిగా ఎక్కేయడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కడప జిల్లా బద్వేలు మండలంలో శనివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బద్వేలు మండలం చింతపుత్తాయపల్లెకు చెందిన బసినేని శ్రీకాంత్‌రెడ్డికి (32), శిరీష (30) దంపతులకు మూడేళ్ల కూతురు రిషికారెడ్డి ఉంది. శ్రీకాంత్‌రెడ్డి దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరి సమీప బంధువులు శశికళది బి.కోడూరు మండలం గంగిరెడ్డిపల్లె కాగా, స్వర్ణలతది మేకవారిపల్లె. వీరు కూడా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. శని, ఆదివారాలు సెలవులు కావడం తమ ఊరిలో రామాలయ మండలపూజ, అలాగే తమ కుమార్తెకు పుట్టెంటుకలు తీయించాలనే ఉద్దేశంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాంత్‌రెడ్డి, శిరీష, వీరి కుమార్తె రిషికారెడ్డి, శశికళ, ఆమె పిల్లలు పి.సాయిహర్షిణి(11), రిషికేశ్‌రెడ్డి(9), కోటగం స్వర్ణలత కలిసి ఒకే కారులో చింతపుత్తాయపల్లెకు బయలుదేరారు. గువ్వలచెరువు ఘాట్ దిగుతుండగా 4వ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ వాహనానికి దారిచ్చేందుకు కారును రోడ్డు పక్కన ఆపారు. ఇంతలో వెనుక నుంచి తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు టెంకాయల లోడుతో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపైకి దూసుకుపోయింది. కారు నుజ్జునుజ్జయి శిరీష, శ్రీకాంత్‌తోపాటు, అక్కాతమ్ముడు సాయిహర్షితారెడ్డి, రిషికేశ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.
రెండు గంటలు కారులోనే..
ఉదయం 9.50 గంటలకు ప్రమాదం జరగ్గా, రెండు గంటలపాటు బాధితులంతా కారులోనే ఇరుక్కుపోయారు. సీకే దిన్నె పోలీసులు లారీని తొలగించడానికి ఎక్సకవేటర్, క్రేన్ తెప్పించారు. కారులో ఇరుక్కుపోయిన చిన్నారి రిషికారెడ్డి, స్వర్ణలత, శశికళను అతి కష్టంమీద రక్షించి చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాంత్‌రెడ్డి, శిరీష, సాయిహర్షిణి, రిషికేశ్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.