Share News

CM Chandrababu: ఏపీ సూపర్‌ హిట్‌

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:29 AM

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జన సైనికుల జోరు.. కమలదళ ఉత్సాహం కలగలసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

 CM Chandrababu: ఏపీ సూపర్‌ హిట్‌

  • తమ్ముళ్ల స్పీడు.. జనసైనికుల జోరు.. కమలదళం హోరు..

  • అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది

  • జాతీయ సగటును మించి రెండంకెల వృద్ధి రేటు

  • ఫేక్‌ రాజకీయాలకు కాలం చెల్లు

  • రప్పా రప్పా అంటే బెండు తీస్తాం

  • ఇక్కడున్నది సీబీఎన్‌.. పవన్‌

  • సీఎం అంటే కామన్‌ మ్యాన్‌

  • ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు

  • నాకు సీఎం పదవి వారే ఇచ్చారు

  • వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కౌగిలి

  • సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు

  • ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే తోకముడుస్తున్నారు

  • ‘అనంత’ సభలో చంద్రబాబు ఫైర్‌

సూపర్‌ హిట్‌ సభను రాజకీయాల కోసమో.. ఓట్ల కోసమో పెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. మాది బాధ్యత గల ప్రభుత్వం.. ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వమని చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేశాం.

కూటమి పాలనలో సంక్షేమం సూపర్‌ హిట్‌.. అభివృద్ధి సూపర్‌ హిట్‌.. వైకుంఠపాళి రాజకీయాలు వద్దు.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించండి.. రాష్ట్రాన్ని అన్నింటా సూపర్‌ హిట్‌ చేద్దాం.

రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఆ హోదా ఇచ్చేది ప్రజలు. నాకు ముఖ్యమంత్రి పదవీ వాళ్లే ఇచ్చారు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అనంతపురం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జన సైనికుల జోరు.. కమలదళ ఉత్సాహం కలగలసి రాష్ట్రం అన్ని కోణాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విధ్వంసకారులకు చెక్‌ పెడుతూ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. అనంతపురంలో బుధవారం జరిగిన ‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. గత పాలకుల అరాచకాలను ప్రస్తావిస్తూ.. ఫేక్‌ రాజకీయాలకు కాలం చెల్లిందని, రప్పా రప్పా బ్యాచ్‌కు పులివెందులలోనే ప్రజలు బుద్ధి చెప్పారని ఇకపై వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంది.


అందుకే రెండంకెల వృద్ధి. సంపద సృష్టిస్తానని చెప్పాను. పెంచిన సంపదను పేదలకు పంచుతానన్నాను. 2025-26లో రాష్ట్రం 10.5 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువ. ఇదీ కూటమి ప్రభుత్వ సత్తా’ అని ప్రకటించారు. ‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాలనపై నిర్వహిస్తున్న తొలి సభ ఇది. నేటి సభకు కారణమైన స్త్రీశక్తికి, యువకిశోరాలకు, ప్రతి తల్లికి, అన్నదాతకు వందనం.. కార్యకర్తల కష్టానికి.. త్యాగానికి వందనం’ అని పేర్కొన్నారు. సంక్షేమం అంటే.. ఓట్ల రాజకీయం కాదని, తాత్కాలిక అవసరాలు తీర్చడం కాదని.. సంక్షేమం అంటే పేదల జీవితాలను మార్చడమేనని చెప్పారు. పథకాలు పేదల జీవనప్రమాణాలు పెంచేవని, అందుకే అన్ని వర్గాలతో మాట్లాడి 2024లో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చామని తెలిపారు. ఈ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని, కనివినీ ఎరుగని రీతిలో కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


అగాధంలోకి నెట్టారు..

గత పాలకులు ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేశారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేశారు. మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించి ఒక్కో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థలను సరిదిద్ది.. మాట ఇచ్చినట్లుగా అన్ని పథకాలూ అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేసి.. సూపర్‌ హిట్‌ చేసి మాట నిలబెట్టుకున్నాం. నాడు మేం సూపర్‌ సిక్స్‌ అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపు అంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్‌ చేశారు. మెగా డీఎస్సీ అవ్వదన్నారు.. దీపం వెలగదన్నారు.. ఫ్రీబస్సు కదలదన్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.


అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం

రాష్ట్రం కోసం నేను, పవన్‌ కల్యాణ్‌ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. ప్రజలకు న్యాయం చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలనేదే మా ఆలోచన. ఇది తప్ప మాకు వేరే ధ్యాస లేదు. ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. మాకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి అనంతపురం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సందర్బంగా మూడు పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఓ మాట స్పష్టం చేస్తున్నా.. మనం పాలకులం కాదు.. సేవకులం. పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్‌ కోసం పనిచేసే వారసులం. అహంకారం, అవినీతి, అలసత్వం, అసంతృప్తి అనేది దరికి రానివ్వద్దు. ఏ పొరపాటూ చేయవద్దు. అదే సమయంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత మనందరిపై ఉంది. ఐకమత్యంతో ఉండాలి. కలిసి ఉంటేనే మనకు బలం. 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నాలుగో సారి సీఎంగా ఉన్నా. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు కామన్‌ మ్యాన్‌. నేనే క్యామన్‌ మ్యాన్‌ అంటే మన ఎమ్మెల్యేలు కూడా కామన్‌ మ్యాన్‌లానే ఉండాలి. ఆర్భాటాలకు దూరంగా ఉండండి, ఇష్టానుసారం వ్యవహరించొద్దు. నేను, పవన్‌, మాధవ్‌ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు) ఓ కమిట్‌మెంట్‌తో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో రామరాజ్యంలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్‌, మాధవ్‌ది. ఎమ్మెల్యే తప్పు చేసినా.. కార్యకర్త తప్పు చేసినా.. అధికారి తప్పు చేసినా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే అందరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా, పవన్‌, మాధవ్‌ కూడా వారి వారి పార్టీల వారితో మాట్లాడుతున్నారు. మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం.. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలూ సహకరించాలి. కలిసి పోటీ చేశాం.. కలిసి గెలిచాం.. కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్‌ కాంబినేషన్‌ కొనసాగుతుంది.


మెడికల్‌ కాలేజీలంటే తెలియని నాయకుడు..

రాష్ట్రంలో ఓ నాయకుడు ఉన్నాడు. మెడికల్‌ కాలేజీలంటే తెలియదు.. ఏదో పొడిచేశానని చెబుతున్నాడు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. ఆస్తి మనది.. వేరేవారు నిర్వహిస్తారు. 2026-27కి నాలుగు, 2027-28కి ఏడు మెడికల్‌ కాలేజీలు వస్తాయి. వీటిలో 50శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద వస్తాయి. వైసీపీ హయాంలో 42 శాతమే వచ్చేవి. వైసీపీ వారు శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఉండేది సీబీఎన్‌, పవన్‌ కల్యాణ్‌. ఆడబిడ్డలను అవమానిస్తే ఖబడ్దార్‌. పోస్టు పెట్టిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారు.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దసరా కానుకగా పన్నులు తగ్గిస్తున్నారు. ఆ స్ఫూర్తితో చిన్నా పెద్దా.. ధనిక పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సిల్‌ హెల్త్‌ స్కీం తీసుకొస్తున్నాం. అందరికీ రూ.2.50 లక్షలు ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం దేశంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. పేదవారికి రూ.25 లక్షలు ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమా అందిస్తాం. దీంతోపాటు సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.


జగన్‌కు క్లాస్‌ తీసుకోండి..

వైసీపీ వారిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున వారి ఫేక్‌ మాటలు నమ్మి దగ్గరకు వెళ్తే ఆ ధృతరాష్ట్ర కౌగిలికి బలవుతారు. ఆ ఐదేళ్లూ రాష్ట్ర ప్రజలందరిదీ అదే పరిస్థితి. ఉనికి కోల్పోతున్నందునే వైసీపీ ఫేక్‌ ప్రచారాలు చేస్తోంది. పార్టీ కార్యాలయాలు మూసుకుని సోషల్‌ మీడియా కార్యాలయాలు తెరుస్తున్నారు. సిద్ధం సిద్ధం అంటూ నాడు ఎగిరిపడ్డారు. నేడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే కిక్కురుమనడం లేదు. ప్రజలంతా కలిసి జగన్‌కు క్లాస్‌ తీసుకోండి. ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలు చర్చించాలని చెప్పండి.

నేపాల్లోని తెలుగువారిని తీసుకొచ్చే బాధ్యత లోకేశ్‌కు

నేపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్క డ సుమారు 200 పైచిలుకు తెలుగువారు చిక్కుకుపోయారు. ‘ఆపదలో ఉన్న మన తెలుగువారిని ఆదుకునేందుకు.. వారికి ధైర్యం చెప్పేందుకు మంత్రి లోకేశ్‌ను ఆర్టీజీఎ్‌సలో ఉండి పర్యవేక్షించాలని చెప్పా. తెలుగువారందరినీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత అప్పగించా. అదీ బాధ్యత అంటే.


సీమ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చింది టీడీపీనే..

తెలుగుదేశం ఆవిర్భావంతోనే రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైంది. వారి జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు మా హయాంలో వచ్చినవే. ఈ ఏడాది రాయలసీమలో వర్షాలు పడలేదు. అయినా అన్ని చెరువుల్లోకి నీరు పారిస్తున్నాం. సీమలో 52 సీట్లకు 45 సీట్లు గెలిచాం. భవిష్యత్‌లో 52 స్థానాలూ గెలుస్తాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది. ఈ ప్రాంత అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ అమలు చేస్తున్నాం. రూ.3,850 కోట్లతో హంద్రీ-నీవా కాలువ విస్తరించి కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకొచ్చాం. ఐదేళ్లలో వైసీపీ వారు చేయలేని పనిని 100 రోజుల్లో చేశాం. అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపుతాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమని నిరూపిస్తాం. ఎవరు అడ్డుపడినా సీమ అభివృద్ధి ఆగదు. ఇది నా భరోసా.. సీబీఎన్‌ భరోసా!


బిడ్డల బంగారు భవిష్యత్‌కు పెట్టుబడి..

ఏ వ్యక్తి జీవితాన్నైనా.. ఏ కుటుంబ స్థితిగతులనైనా మార్చేది చదువు. ప్రతి పేద బిడ్డా చదవాలని తల్లికి వందనం తీసుకొచ్చాం. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నా కళ్లతో చూశాను. ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలు ఉన్నారు. అందరికీ డబ్బులు ఇచ్చారని చెబుతుంటే దానికన్నా ఆనందం ఏముంది. ఇది రూ.10 వేల కోట్ల పథకం కాదు. మీ బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి.

  • స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాం. నాడు బాబే మీ డ్రైవర్‌ అని చెప్పాను. చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేశారు. మహిళలకు రూ.200 కోట్లు ఆదా అయింది.

  • రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకాన్ని తెచ్చాం. కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి ఏటా మూడు విడతల్లో రూ.20వేలు ఇస్తున్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ.7వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత లేకుండా చూసుకుంటాం. ఎంత యూరియా కావాలో అంతే వాడండి.


  • ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలెండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1,704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల ఉచిత సిలెండర్లు మహిళలకు ఇచ్చాం.

  • యువకిశోరాలకు అండగా ఉంటే కొండలనైనా బద్దలు చేస్తారు. 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్‌ సిక్స్‌లో చెప్పాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశాం. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మనం ఏడాదిలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. మీ భవిష్యత్‌ను బంగారు భవిష్యత్‌ చేసే బాధ్యత మాది.

  • ఒకప్పుడు ప్రతి ఇంటికీ ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అన్నాను. ఈసారి ప్రతి ఇంటికీ ఓ పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెబుతున్నాను. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం.

  • దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం మనం ఇస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు. పేదల సేవలో భాగంగా ప్రతినెలా 64 లక్షల మందికి పించన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.45 వేల కోట్లు ఇచ్చాం.

  • పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు పెట్టాం. వాటి ద్వారా ఇప్పటి వరకు 5.60 కోట్ల భోజనాలతో పేదల కడుపు నింపాం. ఇంతకంటే ఆనందం ఏముంది? గత ప్రభుత్వం పేదల పొట్టకొట్టి.. అన్న క్యాంటీన్లు మూసేసింది.

Updated Date - Sep 11 , 2025 | 05:07 AM