Nara Lokesh : విద్యార్థుల చెంతకే ఆధునిక విజ్ఞానం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:31 AM
విష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు వివరించే లక్ష్యంతో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’ను రూపొందించిన ఇన్ఫోసిస్
వాహనాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్
అమరావతి, తాడేపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు వివరించే లక్ష్యంతో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’ను ప్రభుత్వం మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనం ఇక్కడి స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. ఈ వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలో శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులోని పలు పరికరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీ స్టేట్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీ జి.గణే్‌షకుమార్, ఇన్ఫోసిస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉచితంగా కోర్సులు నేర్చుకునే అవకాశం
ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్, ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో రాష్ట్రంలో ప్రారంభించి విద్యార్థులకు ప్రాథమిక నైపుణ్యాలు అందించడమే ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ముఖ్య ఉద్దేశం. 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఏర్పాటు చేస్తారు. అనంతరం విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ర్పింగ్ బోర్డ్ ప్లాట్‌ఫారం ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేట్ అందజేస్తారు. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ. 5 కోట్ల ఖర్చుతో ల్యాబ్‌తో కూడిన బస్సు ఏర్పాటు చేసింది. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఏటా రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని ఇన్ఫోసిస్ భరిస్తుంది. విద్యార్థులకు ట్రైనర్ సపోర్టును ఇస్తారు. ఒక్కో విద్యార్థిపై సగటున రూ. 1,500 వరకు ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు 4,800 మంది విద్యార్థులను చేర్చుకోవాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది.