Amaravati Development: మహా అమరావతి
ABN , Publish Date - May 02 , 2025 | 06:35 AM
అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి 50 వేల ఎకరాలు భూసమీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయం, స్టేడియం, రైల్వే మార్గాలు వంటి ప్రాజెక్టులకు భూమి అవసరమని తెలిపిన సీఎం చంద్రబాబు, రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధికి అడుగులు
విమానాశ్రయం, స్టేడియం, ఇతర అవసరాలకు మరో 50 వేల ఎకరాల భూసమీకరణకు యోచన
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
అమరావతి రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. అమరావతిలో ఎల్‌పీఎస్ లేఅవుట్లు, కమర్షియల్ ప్లాట్లు, వివిధ సంస్థలు, మౌలిక సదుపాయాలకు పోను ప్రభుత్వం వద్ద రిజర్వ్ భూమి కొద్దిగా మాత్రమే ఉంది. దీంతో భవిష్యత్తులో కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులకు భూములు కేటాయించే అవకాశం ఉండదు. దీంతో భవిష్యత్తు అవసరాలకు దాదాపు 50 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. నగరానికి అంతర్జాతీయ హంగులు రూపుదిద్దుకోవాలంటే సువిశాలమైన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అవసరం. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం, రైలు మార్గాలు ఉంటేనే ఆ నగరం సంపూర్ణంగా ఉంటుంది. ఇతర అవసరాలకు కూడా భూమి అవసరం. గత టీడీపీ ప్రభుత్వం గుంటూరు, విజయవాడ, అమరావతి మూడు నగరాలు భవిష్యత్తులో కలిసిపోయి ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపాంతరం చెందుతాయని భావించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కృష్ణానది ఒడ్డున దాదాపు 33 వేల ఎకరాలు భూసమీకరణ చేసింది. కేటాయింపులు పోనూ సువిశాలమైన భూమి ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదు. ఉన్న రిజర్వ్ భూమి అక్కడక్కడ పార్సిల్స్‌గా ఉన్నది.
రైతుల నుంచి సానుకూలత
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ఒకే చోట 5 వేల ఎకరాల భూమిని కేటాయించారు. నేడు దేశంలోనే రద్దీ విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ ఉంది. అంతేగాక ఎయిర్‌పోర్టు చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతికి సమీపంలో మరికొంత భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి దగ్గరగా వైకుంఠపురం, యండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి, చావపాడు గ్రామాల్లో తొలుత 9 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తోంది. ఈ గ్రామాల రైతులందరికీ ఒకే చోట ఎల్‌పీఎస్ లేఅవుట్లు వేసి భూములు ఇవ్వడం ద్వారా వేరే చోట ప్రభుత్వానికి ఎక్కువ విస్తీర్ణంలో భూమి సమకూరుతుంది. ఇలాగే తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, తాడికొండ మండలంలోని కంతేరు, మోతడక, తాడికొండ గ్రామాల్లో కలిసి మరో 40 వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నూతన రైలుమార్గం, రైల్వే స్టేషన్లు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి వాటికి భూములు కేటాయించే అవకాశం ఉంటుంది. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ కొన్ని రోజుల నుంచి రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదనపు భూసమీకరణ చేసినా రాజధానిలో భూముల ధరలు పడిపోవని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇస్తుండటంతో మెజార్టీ రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. త్వరలో భూసమీకరణ పూర్తి చేసి అమరావతి ఒక మహా రాజధానిగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.