Share News

Nadendla Manohar: అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకోవద్దు

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:39 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం తెనాలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.

Nadendla Manohar: అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకోవద్దు
AP Minister Nadendla Manohar

విజయవాడ, జూన్ 02: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం తెనాలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమవారం విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. తెనాలిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పర్యటన చేయాలని వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వ హయాంలో తెనాలిని గంజాయి అడ్డగా మార్చేశారని విమర్శించారు. దీంతో పోలీసులు సైతం మిమ్మల్ని ఆపలేరనే విధంగా గంజాయి బ్యాచ్ తయారైందన్నారు.

గతంలో తన స్నేహితుడి కుమారుడిని సైతం అడ్డుకొని దాడి చేశారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి బహిరంగ సభలో ఐదు నిమిషాల్లోనే ఎన్నిక పూర్తయిపోతుందన్నారని.. ఈ గంజాయి బ్యాచ్‌ను చూసుకునే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ అంటే ఈ బ్యాచ్‌‌కు భయం లేకుండా తయారయిందని చెప్పారు.


ఎన్నికల పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తిని మీ పార్టీకి చెందిన గంజాయి బ్యాచ్ దాడి చేయడం నిజం కాదా? అని వైఎస్ ‌జగన్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు. అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకో వద్దంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు హితవు పలికారు. తెనాలి పర్యటనపై ఆలోచించుకోవాలని వైఎస్ జగన్‌కు ఈ సందర్బంగా ఆయన కీలక సూచన చేశారు. గత ఐదేళ్లలో ఈ బ్యాచ్ ఎంత మందిని ఇబ్బంది పెట్టారన్నారు. ఇక తెనాలిలోని ఐతా నగర్‌లో ఎంతో మంది తల్లులు భయబ్రాంతులకు గురయ్యారన్నారు.


గంజాయి మత్తు ద్వారా ఎంతో మంది యువత చెడు మార్గం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి కోసం ఒక యువకుడు తల్లినీ కొట్టడానికి కూడా వెనకాడటం లేదన్నారు. వల్లభా పురం అనే గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని చెప్పారు. మీ హయంలో లా అండ్ ఆర్డర్ కోసం మీరు ఏమి చేశారంటూ వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా నిలదీశారు. తెనాలిలో పర్యటించి వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో అమలాపురంలో కులాలు మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అంటూ వైఎస్ జగన్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ చురకలంటించారు.

Updated Date - Jun 02 , 2025 | 07:52 PM