AP Liquor Scam Exposed: ముడుపులిస్తేనే ఆర్డర్లు
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:18 AM
మద్యం కుంభకోణంలో ఆర్డర్ ఫర్ సప్లై (ఓఎఫ్ఎస్)ల ది కీలక పాత్ర. మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీలు చేసుకొనే విన్నపం ఇది. ఆటోమేటిక్ ఆర్డర్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వం మాన్యువల్ విధానం...
మాన్యువల్ విధానంతో కంపెనీలకు చుక్కలు
2020లోనే 111 ఓఎఫ్ఎస్‌ల తిరస్కరణ
కొన్ని కంపెనీలపై అమితమైన ప్రేమ.. ఊరూ పేరు లేని బ్రాండ్లకు వంద శాతం అనుమతులు
పాపులర్ బ్రాండ్లు రాకుండా మోకాలడ్డు
హడావిడిగా తెరపైకి అనామక బ్రాండ్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం కుంభకోణంలో ఆర్డర్ ఫర్ సప్లై (ఓఎఫ్ఎస్)ల ది కీలక పాత్ర. మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీలు చేసుకొనే విన్నపం ఇది. ఆటోమేటిక్ ఆర్డర్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వం మాన్యువల్ విధానం తీసుకొచ్చి కంపెనీలకు చుక్కలు చూపించింది. ఏ కంపెనీకి ఎన్ని ఆర్డర్లు ఇవ్వాలి? ఏ కంపెనీలను ప్రమోట్ చేయాలి? ఏ కంపెనీలను తొక్కేయాలి? అనే వ్యూహరచన అప్పట్లో ఎక్సైజ్ శాఖలో జరిగింది. ఎ-1 కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కంపెనీలపై అమితమైన ప్రేమ చూపించారు. ఒక్క 2020లోనే 111 ఓఎఫ్ఎస్‌లు తిరస్కరించారు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని కంపెనీల వినతులను ఏకపక్షంగా తిరస్కరించి, ఊరూ పేరు లేని కొత్త బ్రాండ్లకు వంద శాతం ఆర్డర్లకు అనుమతులు ఇచ్చేశారు. ఫలితంగా లిక్కర్ మార్కెట్‌లో జే-బ్రాండ్ల హవా కొనసాగింది. కొన్ని కంపెనీలను కమీషన్ల పరిధిలోకి తీసుకొచ్చిన ఆర్డర్లు పునరుద్ధరించారు. కొన్ని బ్రాండ్లను ప్రోత్సహించడం, కొన్నిటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందని చార్జ్‌షీట్‌లో సిట్ స్పష్టం చేసింది.
అనుమతుల్లో వివక్ష
2020లో ఆల్కో బ్రూ డిస్టిల్ ఇండియా కంపెనీ 68,450 కేసుల సరఫరాకు రిక్వెస్ట్ పెడితే 25,400 కేసులకే అనుమతించారు.
కార్ల్స్‌బర్గ్ ఇండియా కంపెనీ 55,200 కేసులు సరఫరా చేస్తామని అడిగితే కేవలం 7,200 కేసులు మాత్రమే తీసుకున్నారు.
పెర్నోడ్ రికార్డ్‌కు 100 శాతం, క్రోన్ బీర్ ఇండియా కంపెనీకి 89శాతం, అన్‌హెసర్ బుష్ ఇన్‌బేవ్ ఇండియాకు 88శాతం శాతం ఆర్డర్లు తిరస్కరించారు.
ఎస్‌ఎన్‌జే డిస్టిలరీస్, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, విశాఖ డిస్టిలరీస్, ఈగల్ డిస్టిలరీస్, ఇతర కొన్ని డిస్టిలరీలకు వంద శాతం ఆర్డర్లు అనుమతించారు.
డిస్టిలరీల పేరిట దందా!
కేవలం మద్యం వ్యాపారం కోసమే రూ.60కోట్ల పెట్టుబడితో ఆదాన్ డిస్టిలరీస్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం, ఏపీఎస్బీసీఎల్, వైసీపీ నేతల సహకారంతో భారీగా ఓఎఫ్ఎస్ లు దక్కించుకున్నారు. ఈ కంపెనీ పూర్తిగా కసిరెడ్డి, విజయసాయిరెడ్డి ఆదేశాలతో నడిచేది. 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్యకాలంలో రూ.732 కోట్ల వ్యాపారం చేసింది. ఇతర డిస్టలరీలను లీజుకు తీసుకుని సొంత బ్రాండ్లను తయారుచేసింది. ఒక్క ఆదాన్ నుంచి రూ.135 కోట్లు వరకూ ముడుపులు నిందితులకు అందినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అదాన్ కేవలం డబ్బు సంపాదన కోసం ఏర్పాటైన క్రిమినల్ సంస్థగా సిట్ పేర్కొంది.
పాండిచ్చేరికి చెందిన లీలా డిస్టిలరీని నిందితులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ సర్కారు వచ్చిన మొదటి ఏడాదిలో ఆదాన్ సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా రాష్ట్రంలో పలు మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఆదాన్ నుంచి సరఫరా తగ్గించి లీలా డిస్టలరీ ద్వారా మద్యం సరఫరా చేయాలని నిర్ణయించారు. 2021 జూన్ నుంచి 2024 మార్చి మధ్యకాలంలో మూడేళ్లలో రూ.454 కోట్ల మేర లీలా డిస్టిలరీ ద్వారా వ్యాపారం చేశారు. ఈ సంస్థ నుంచి దాదాపు రూ.62 కోట్లు ముడుపులు చేతులు మారాయి.
ఎస్పీవై సంస్థ ద్వారా రాష్ట్రంలో 2019-2024 మధ్యకాలంలో రూ.1,569 కోట్ల వ్యాపారం జరిగింది. లిక్కర్ సిండికేట్‌లో సజ్జల శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన పాత్ర వహించింది. ఆదాన్, లీలా డిస్టలరీల తరహాలో షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News