Purushotham In AP Liquor Scam: మద్యం స్కామ్‌లో పెరిగిన నిందితుల సంఖ్య
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:47 PM
ఏపీ మద్యం కుంభకోణంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కుంభకోణంలో మరో నిందితుడిని సిట్ అధికారులు చేర్చారు.
విజయవాడ, జులై 04: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొత్తగా మరొకరిని నిందితుడిగా సిట్ చేర్చింది. పురుషోత్తం అనే వ్యక్తిని ఏ 40గా చేర్చింది సిట్. దీంతో ఈ కేసులో మెుత్తం నిందితుల సంఖ్య 40కి చేరింది. ఈ స్కామ్‌లో ముడుపుల రవాణాలో పురుషోత్తం కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి.. కొత్త బ్రాండ్లను తెరపైకి తీసుకువచ్చారు. అది కూడా కొత్త పేర్లతో.. నూతన బ్రాండ్లతో మార్కెట్‌లోకి తెచ్చారు. ఈ బ్రాండ్ల మద్యం తాగి పలువురు చనిపోతే.. కొంత మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అంతేకాకుండా ఈ మద్యం కొనుగోళ్ల నగదు లావాదేవీలన్నీ ఆన్ లైన్‌లో కాకుండా నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అయితే ఈ మద్యం విక్రయాల అనంతరం నగదు ఏమైందో ఎవరికీ తెలియదు. అలాంటి వేళ తాము అధికారంలోకి వస్తే.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దాంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రదారి అంటూ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి చెప్పిన సమాచారం మేరకు వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప, తదితరులను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.