Share News

Education Reforms: ఇకపై ఎంబైపీసీ..!

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:24 AM

ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెడుతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఇదే అంశంపై గురువారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఉండవల్లిలో ఇంటర్‌ బోర్డు సమావేశం జరిగింది.

Education Reforms: ఇకపై ఎంబైపీసీ..!

  • ఎంపీసీ, బైపీసీ రెండూ కలిపి చదవాలనుకునే విద్యార్థులకు అవకాశం

  • ఏప్రిల్‌ 1 నుంచే ఇంటర్‌ తరగతులు

  • ఫిబ్రవరి చివర్లో పబ్లిక్‌ పరీక్షలు

  • గణితం, బోటనీ, జువాలజీ సబ్జెక్టులు విలీనం

  • ఇంటర్‌ బోర్డు సమావేశంలో నిర్ణయాలు

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెడుతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఇదే అంశంపై గురువారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఉండవల్లిలో ఇంటర్‌ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. 2025-26 ఇంటర్‌ విద్యా సంవత్సరం రానున్న ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్‌ 1న ప్రారంభమౌతుంది. ఇకపై ఏప్రిల్‌ 1న విద్యాసంవత్సరం ప్రారంభించి, అదే నెలలో 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. అనంతరం జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం కొనసాగుతుంది. అలాగే ఏప్రిల్‌ 7 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపడతారు. అలాగే పబ్లిక్‌ పరీక్షలు ఇకపై మార్చిలో కాకుండా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించనున్నారు. అలాగే ఎంపీసీ, బైపీసీ కలిపి చదవాలనుకునే వారి కోసం ‘ఎంబైపీసీ’ని ప్రవేశపెడుతున్నారు.


1973 నుంచి 2003 వరకు మొత్తం ఇంటర్‌ సర్టిఫికెట్లను డిజిటలైజేషన్‌ చేస్తారు. వీటిని డిజీ లాకర్‌, వాట్సా్‌పలో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌లో ఆరుకు బదులుగా ఐదు సబ్జెక్టుల విధానం తీసుకొస్తున్నారు. ఇందులో రెండో సబ్జెక్టు ఎంపిక సబ్జెక్టుగా ఉంటుంది. అలాగే కావాలనుకుంటే విద్యార్థులు ఆరో సబ్జెక్టునూ తీసుకోవచ్చు. ఆరు సబ్జెక్టులు తీసుకున్న విద్యార్థులు ఏవైనా ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే వారికి ఇంటర్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఇకపై ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఈఏపీసెట్‌, జేఈఈ, నీట్‌పై విద్యార్థులకు మెటీరియల్‌ ఇవ్వడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఇక నుంచి పరీక్షల్లో 10 శాతం ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి. బోర్డు సమావేశంలో ఉన్నతాధికారులు కోన శశిధర్‌, భరత్‌ గుప్తా, కృతికా శుక్లా, వి.విజయరామరాజు, కె.మధుమూర్తి, బి.శ్రీనివాసరావు, గణే్‌షకుమార్‌, పలు వర్సిటీల వీసీలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


రేపటి నుంచి ఒంటిపూట బడులు

ఒంటిపూట బడులను శనివారం నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎండలు పెరుగుతున్నందున ఈ ఏడాది ఒకట్రెండు రోజులు ముందు నుంచే ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయి. టెన్త్‌ పరీక్షలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఏప్రిల్‌ 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తారు.

Updated Date - Mar 14 , 2025 | 04:24 AM