Share News

AP High Court : ఐఓఏ మార్గదర్శకాలను విధిగా పాటించాలి

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:09 AM

ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను తూ.చ.తప్పకుండా పాటించాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌...

AP High Court : ఐఓఏ మార్గదర్శకాలను విధిగా పాటించాలి

  • శాప్‌, వివిధ అసోసియేషన్లకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్‌ వేదికగా ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ జాతీయ క్రీడలకు రాష్ట్రం నుంచి క్రీడాకారులను పంపే విషయంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను తూ.చ.తప్పకుండా పాటించాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌), ఏపీ ఆర్చరీ, ఏపీ అథ్లెటిక్‌, ఏపీ జూడో, ఏపీ ఖోఖో, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లకు హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఈ ఆదేశాలిచ్చింది. జాతీయ క్రీడలకు ఏపీ నుంచి క్రీడా బృందాలను పంపే అధికార పరిధి పిటిషనర్‌కు (ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌) ఉందని స్పష్టం చేసింది. క్రీడాకారుల ఎంపిక విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులు, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదని పేర్కొంది. జాతీయ క్రీడలకు క్రీడా బృందాలను పంపేవిషయంలో రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ బాధ్యతలను పిటిషనర్‌ అసోసియేషన్‌ నిర్వహించడమే సముచితమని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్‌ జడ్జి శుక్రవారం తీర్పు ఇచ్చారు.

Updated Date - Jan 25 , 2025 | 05:10 AM