AP High Court : కేసుల దర్యాప్తులో పురోగతి ఏదీ?
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:10 AM
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో...
అనుచిత పోస్టులు పెట్టినవారిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారంతే
దర్యాప్తు చేసి ఉంటే వివరాలు కోర్టు ముందు ఉంచేవారు కదా!
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు తేలిగ్గా భావిస్తున్నారు
‘సోషల్ కేసుల’పై హైకోర్టు వ్యాఖ్య
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిని కొట్టి లోపలేయడం తప్ప వారిపై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి ఉండడం లేదని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన భర్త బోస రమణను ప్రకాశం జిల్లా, పొదిలి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన సతీమణి లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యం తాజాగా విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) విష్ణుతేజ స్పందిస్తూ.. నిందితుడు బోస రమణను పొదిలి పోలీసులు అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ మందు హాజరుపర్చకుండా వదిలివేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రకాశంజిల్లా ఎస్పీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ నివేదిక సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. పొదిలి సీఐ తరఫు న్యాయవాది రిత్విక్ వాదనలు వినిపిస్తూ.. నిందితుడికి పూర్వ నేరచరిత్ర ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన తర్వాత కేసు దర్యాప్తు పురోగతి ఏదశలో ఉందని ప్రశ్నించింది. కేసులు కట్టి వ్యక్తులను అరెస్ట్ చేయడం, కొట్టి వారిని లోపల వేయడం తప్ప కేసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి ఉండడం లేదని పేర్కొంది.
కేసు దర్యాప్తు చేసి ఉంటే వివరాలను కోర్టు ముందు ఉంచేవారని వ్యాఖ్యానించింది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, ఇచ్ఛాపురం సీఐ చిన్నం నాయుడులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. బోస రమణ అరెస్ట్ విషయంలో నివేదిక సమర్పించేందుకు ప్రకాశం ఎస్పీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన భర్త బోస రమణను దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన భార్య బోస లక్ష్మి గత ఏడాది నవంబరులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం పొదిలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పొదిలి ఇన్‌స్పెక్టర్ కౌంటర్ దాఖలు చేశారు.