Share News

AP High Court: హెల్మెట్‌ ధరించక 4,276 మంది మృతి

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:47 AM

గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలలో 4,276 మంది మరణించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

AP High Court: హెల్మెట్‌ ధరించక 4,276 మంది మృతి

  • గత ఏడాది ప్రమాదాలపై హైకోర్టు ఆందోళన

  • బెజవాడ పోలీసులకు అభినందనలు

  • అవగాహన కొనసాగించాలని నిర్దేశం

  • పత్రికలు, టీవీల్లోనూ ప్రకటనలివ్వాలని సూచన

  • అందుకు నిధులు ఇవ్వాలని సీఎ్‌సకు ఆదేశం

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలలో 4,276 మంది మరణించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసింది. హెల్మెట్‌ ధరించే విషయంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులకు స్పష్టం చేసింది. విజయవాడలో హెల్మెట్‌ ధరించేవారి సంఖ్య పెరిగిందంటూ పోలీసుల చర్యలను అభినందించింది. నిబంధనలు అతిక్రమించడం, హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల జరిగే దుష్ప్రభావాలపై పత్రికలు, టీవీలలో ప్రకటనలు ఇచ్చేందుకు అవసరమైన నిధుల విడుదలకు సంబంధించి పోలీసుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించింది. ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు బాడీ కెమెరా ధరించడం తప్పనిసరి చేయాలని తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను ఆటోమేటిక్‌గా గుర్తించేందుకు రాష్ట్రంలోని సీసీ కెమెరాలను ఏపీఫైబర్‌నెట్‌కు అనుసంధానం చేస్తున్నామని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు ప్రకటించింది. సీసీకెమెరాల అనుసంధానం, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ ప్రాజెక్ట్‌ పురోగతిపై తదుపరి విచారణలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఫైబర్‌నెట్‌ ఎండీని ఆదేశించింది. విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధించడంలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసుల తనిఖీలు విజయవాడకే పరిమితమయ్యాయన్నారు. ఇతర జిల్లాల్లో ఎక్కడా ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించడం లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్మెట్‌ పెట్టుకున్నవారిని గ్రహాంతరవాసిగా చూస్తున్నారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. మోటార్‌ వాహన చట్టాలపై ప్రభుత్వం నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 04:47 AM