Share News

Panchayat Raj Dept : గాడిలో గ్రామీణాభివృద్ధిశాఖ!

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:49 AM

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో గ్రామీణాభివృద్ధిశాఖను అస్తవ్యస్తం చేశారు. ప్రధానమైన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు.

Panchayat Raj Dept : గాడిలో గ్రామీణాభివృద్ధిశాఖ!

  • సంస్కరణల బాట పట్టించాలని నిర్ణయం

  • పంచాయతీరాజ్‌ తరహాలో ప్రక్షాళన చేసే యోచన

  • ఉద్యోగుల పదోన్నతులు, జీతాల వ్యత్యాసాలపై దృష్టి

  • వేతనాలు పెంచేందుకు పక్కాగా మార్గదర్శకాలు

  • ఎప్పటికప్పుడు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు

  • ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో కసరత్తు ప్రారంభించిన అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పంచాయతీరాజ్‌శాఖలో ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిశాఖలోనూ సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తోంది. తొలుత ఉద్యోగుల పదోన్నతులు, జీతాల వ్యత్యాసాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. వేతనాలు పెంచేందుకు మార్గదర్శకాలు పక్కాగా రూపొందించాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో గ్రామీణాభివృద్ధిశాఖను అస్తవ్యస్తం చేశారు. ప్రధానమైన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. వాటర్‌షెడ్‌ లాంటి పథకాల నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. సమస్యల పుట్టగా ఉన్న గ్రామీణాభివృద్ధిశాఖను కచ్చితంగా సంస్కరించాల్సిన అవసరముందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఆయన ఆదేశాలతో ఇప్పటికే కమిషనర్‌ కృష్ణతేజ ఉన్నతాధికారులతో సంప్రదించి గ్రామీణాభివృద్ధి శాఖలో సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఉన్నతస్థాయిలో దానిపై ప్రస్తావన జరిగినట్లు సమాచారం.


పెరగని జీతాలు, దక్కని పదోన్నతులు..

గ్రామీణాభివృద్ధిశాఖలో పథకాలన్నీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే అమలు చేస్తున్నారు. అధికారులను డిప్యుటేషన్‌ ద్వారా తీసుకున్నారు. కేంద్ర పథకాలైన ఉపాధి, వాటర్‌షెడ్‌ తదితర వాటిల్లో రాష్ట్రంలో సుమారు 3 వేల మందికి పైగా మండల, జిల్లా స్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి లోకేశ్‌ హయాంలో పెంచిన జీతాలు తప్ప గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వారికి జీతాలు పెంచలేదు. ఽనిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలోనూ ఉద్యోగాలు భారంగానే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. 2016-17లో అప్పటి కమిషనర్‌ రామాంజనేయులు ఉపాధి సిబ్బందికి పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఆఖరులో ఉపాధి సిబ్బందికి హెల్త్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత వైసీపీ సర్కార్‌ దానిని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో స్థానిక నేతల ఒత్తిడితో ఉపాధి హామీ పథకంలో జరిగిన అడ్డగోలు బదిలీలతో సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి ఇప్పుడు సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తుంటే దొంగలెక్కలన్నీ బయటపడుతున్నాయి. అప్పట్లో పనులు లేకుండా మస్టర్లు వేసినందుకు ఇప్పుడు రూ.లక్షలు రికవరీలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సిబ్బందిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. లేని పనులకు అప్పట్లో ఒత్తిడి చేసి మస్టర్లు వేయించారని, ఇప్పుడు తమను కాపాడేవారు లేరని సిబ్బంది వాపోతున్నారు.


సంస్కరణలు చేపడితేనే పథకం ముందుకు..

గ్రామీణాభివృద్ధిశాఖలో సమూల సంస్కరణలు చేపడితేనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని ఆ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మరిన్ని అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ‘‘ఒక నిర్ధిష్ట విధానంలో నియామకాలు చేపట్టడంతో పాటు బదిలీలకు కూడా కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. బదిలీల్లో వీలైనంత వరకు రాజకీయ జోక్యం లేకుండా చేయాలి. ఏటా జీతాలు పెంచడంతో పాటు పీఆర్సీకి అనుగుణంగా వేతనాలు మార్చాలి. సోషల్‌ ఆడిట్‌కు సంబంధించి సిబ్బందిని జవాబుదారీ చేయడంలో మరిన్ని మార్పులు తీసుకురావాలి. ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకంలోనూ మార్పులు చేయాలి. సిబ్బంది అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలి. ఒకే తరహా ఉద్యోగుల్లో ఉన్న వేతనాల వ్యత్యాసాన్ని సరిచేయాలి. సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించాలి. రిటైర్మెంట్‌ వయసును 62కు పెంచాలి. గ్రాట్యుటీ లాంటి ఇతర ప్రయోజనాలను అందించాలి. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తవుతాయి’’ అని వారు పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 05:49 AM