Village Secretariats: సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:02 AM
గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు...
2,778 పోస్టులు మంజూరు
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. డిప్యుటేషన్/ఔట్‌సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోనున్నారు. 993 కొత్త ఏఎన్‌ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు.
నియామకాలు.. పర్యవేక్షణ ఇలా..
గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆరుగురిని, డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని డిప్యుటేషన్‌పై ఫంక్షనల్ అసిస్టెంట్లుగా తీసుకుంటారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి 17 మంది జాయింట్ డైరెక్టర్/డీఎల్‌డీఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు. ఆ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు, 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, 52 మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు, 104 మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. 26 మంది ఆఫీసు సబార్డినేట్లను ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమిస్తారు.
మండల స్థాయిలో పంచాయతీరాజ్‌శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్‌పై నియమిస్తారు.
అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్ డైరెక్టర్ కమ్ అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు సెలెక్షన్ గ్రేడ్/జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా.. మరో 9 మందిని జిల్లా గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్‌పై నియమిస్తారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..