AP Govt : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తులు వెనక్కే
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:55 AM
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది.
పిల్లల హక్కులు రద్దు చేసే అధికారం ఆర్డీవోకి
ఆదేశాలు జారీ చేసిన రిజిస్ర్టేషన్ల శాఖ
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిచ్చిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది. తల్లిదండ్రులను పట్టించుకోని పక్షంలో వారిచ్చిన ఆస్తులపై పిల్లల హక్కులను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకు ఆ ఆస్తులపై హక్కులు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్‌డీడ్ కింద, సెటిల్‌మెంట్ కింద ఆస్తులు ఇస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తున్న పలు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇకపై ఇలాంటి రిజిస్ర్టేషన్లకు సెటిల్మెంట్లు, గిఫ్ట్‌డీడ్లు రద్దుచేశారు. తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ వస్తేనే రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం 2007లోని సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉంచడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల నిర్లక్ష్యంపై తమ దృష్టికి వచ్చిన కేసులను విచారించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆర్డీవోకి అప్పజెప్పారు. విచారణ తర్వాత ఆ ఆస్తిపై పిల్లల హక్కును రద్దు చేసి తల్లిదండ్రులకు అప్పజెప్పే అధికారం ఆర్డీవోకి ఉంటుంది. ఆర్డీవో ఆదేశాలను రిజిస్ర్టేషన్ల శాఖ తమ కార్యాలయాల్లోని సాఫ్ట్‌వేర్ రికార్డుల్లోనూ పొందుపర్చాలి. ఆర్డీవో ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ర్టేషన్ హక్కులు మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.