AP Government: 7,715 గ్రూపులుగా సచివాలయాలు
ABN , Publish Date - May 18 , 2025 | 03:51 AM
రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను 7,715 గ్రూపులుగా విభజిస్తూ ఉద్యోగుల వర్గీకరణ చేపట్టారు. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్ఎం, ప్రతి వార్డు సచివాలయానికి హెల్త్, శానిటేషన్ సెక్రటరీలు తప్పనిసరి చేశారు.
భౌగోళిక పరిస్థితులను బట్టి గ్రూపింగ్
ఉద్యోగుల వర్గీకరణ..జనాభాను బట్టి నియామకం
ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ఏఎన్ఎం
ప్రతి ‘వార్డు’కు హెల్త్, శానిటేషన్ సెక్రటరీలు
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను గ్రూపులుగా విభజించి, ఆయా సచివాలయాల్లోని ఉద్యోగులను వర్గీకరించారు. శనివారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. భౌగోళిక పరిస్థితులను బట్టి రెండు లేక మూడు సచివాలయాలను ఒక గ్రూపుగా.. మొత్తం 15,004 సచివాలయాలను 7,715 గ్రూపులుగా విభజించాలని ఇదివరకే కలెక్టర్లు ప్రతిపాదనలు చేయగా, వాటికి ఆమోదముద్ర వేసింది. ఆయా సచివాలయాల్లో జనాభాను బట్టి ఏయే కేటగిరి పోస్టులు నియమించాలో, ఏయే కేటగిరి టెక్నికల్ సిబ్బంది ఉండాలో నిర్ణయించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్‌ఎంను తప్పనిసరి చేశారు. అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేక ఎనర్జీ అసిస్టెంట్‌ను, వీఆర్వో లేక సర్వే అసిస్టెంట్‌ను నియమించారు. గ్రూపులో ఆయా ప్రాంతాల్లో సాగు పరిస్థితిని బట్టి అగ్రికల్చర్/హార్టికల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్లలో ఒకరిని, అదేవిధంగా పశు సంపదను బట్టి ఫిషరీస్ /వెటర్నరీ అసిస్టెంట్ ఒకరిని నియమించారు. ప్రతి వార్డు సచివాలయానికి వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు అమెనిటీస్ సెక్రటరీ/వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు రెవెన్యూ సెక్రటరీ/వార్డు ఎనర్జీ సెక్రటరీలను నియమించారు. ఆయా సచివాలయాల గ్రూపునకు అవసరాన్ని బట్టి అదనపు టెక్నికల్ సిబ్బందిని నియమించారు. అగ్రికల్చర్/హార్టికల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్లను ఆయా ప్రాంతాల సాగును బట్టి అదనంగా నియమించారు. పశుసంపదను బట్టి ఫిషరీస్ అసిస్టెంట్/వెటర్నరీ అసిస్టెంట్‌లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సచివాలయాల గ్రూపులుండి, అక్కడ టెక్నికల్ సిబ్బందిని తగిన సంఖ్యలో నియమించకుండా ఉంటే.. ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్/వీఆర్వో/సర్వే అసిస్టెంట్లను అవసరమైన సంఖ్యలో నియమించారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో వార్డు అమెనిటీస్ సెక్రటరీలను అదనంగా నియమించారు. అదనపు సిబ్బంది ఉద్యోగ పరిధిని స్థానికంగా నిర్ణయిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల గ్రూపింగ్, గ్రామ, వార్డు సచివాలయాల టెక్నికల్ సిబ్బంది వివరాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖ విడుదల చేసింది.