AP Govt : అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు!
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:50 AM
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే ప్రపంచస్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి చేరుకుని, పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే వీలుంటుందని భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలు
నేరుగా రాజధానికి వచ్చేలా సదుపాయం
సాధ్యాసాధ్యాలపై నివేదిక కోసం నోటిఫికేషన్
అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి, రాష్ట్ర సరిహద్దు జిల్లా శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే ప్రపంచస్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి చేరుకుని, పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. అమరావతిలోని సెక్రటేరియేట్‌లో సీఎంతో సమావేశమై పెట్టుబడుల ప్రతిపాదనలకు తక్షణం గ్రీన్‌సిగ్నల్ పొందేందుకూ అనువుగా ఉంటుందని యోచిస్తోంది. అలాగే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సమీపంలోనే శ్రీకాకుళం జిల్లాలో మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) సాంకేతిక, ఆర్థిక అంశాల సాధ్యాసాధ్యాలపై నివేదిక (టీఈఎ్‌ఫఆర్)ను సమర్పించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన టీఈఎ్‌ఫఆర్‌ను వేసేందుకుగాను బిడ్లను పిలిచింది. బిడ్లు దాఖలుకు 32 వారాల గడువు ఇచ్చింది. విమానాశ్రయాల నిర్మాణానికి అనువైన ప్రదేశంతో పాటు ఆర్థికంగా వ్యాపారాభివృద్ధి అవకాశాలను గుర్తించాలని ఏపీఏడీసీఎల్ కోరింది. ఈ విమానాశ్రయాల సదుపాయాలను వినియోగించుకునే వారి సంఖ్య సమీప భవిష్యత్తులో ఏ మేరకు పెరుగుతుంది... వాణిజ్యం, సరుకు రవాణాకు అవకాశాలు ఎలా ఉంటాయో కూడా అంచనా వేయాలని కోరింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా విమానాశ్రయ నిర్మాణాలను చేపట్టాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రాజధాని నిర్మాణ పనుల్లో కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి వాటిని నిర్మించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలను స్థాపించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘హైదరాబాద్’ అనుభవంతో... గతంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరగక ముందు ప్రపంచస్థాయి సంస్థలకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. అందరూ చెన్నై విమానాశ్రయానికి వెళ్లేవారు. అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో హైదరాబాద్‌కు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. హైదరాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణం తర్వాత ప్రపంచ స్థాయి సంస్థలు వర్తక, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు అక్కడికి రావడం ప్రారంభించాయి. అమరావతికి సమీపంలోనే గన్నవరంలో విమానాశ్రయం ఉన్నా ఏపీ రాజధానికి దగ్గరలోనే ఉందని ప్రపంచానికి తెలియడం లేదు. ఈ అనుభవాల దృష్ట్యా అమరావతిలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలోనూ విమానాశ్రయ నిర్మాణం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఆర్థిక అంశాల సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.