AP Muslims: ఏపీలో ముస్లింలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:45 PM
ఏపీలో ముస్లింలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేవారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన జీవో విడుదల చేశారు.
విజయవాడ, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు కూటమి ప్రభుత్వ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది (హజ్ 2026) హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లే హాజీలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఈ ప్రోత్సాహకానికి సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
గతంలో హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాల నుంచి మక్కాకు తరలివెళ్లేవారు. ఇప్పుడు విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్ ఏర్పాటుతో భక్తులకు భారీ ఉపశమనం కలిగింది. ఈ సెంటర్ నుంచి వెళ్లేందుకు అదనపు ఖర్చు (రూ.68 వేల వరకు) భరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 347 మంది అభ్యర్థులు విజయవాడ హజ్ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారని హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం విజయవాడను అధికారిక ఎంబార్కేషన్ పాయింట్‌గా ఆమోదించడంతో ఈ సౌకర్యం సాధ్యమైంది. గత హజ్‌లో విజయవాడను ఎంచుకున్న 72 మంది హాజీలకు కూడా లక్ష రూపాయలు అందజేశారు. ఈ నిర్ణయం ముస్లిం సోదరుల్లో ఆనందాన్ని నింపుతోంది. హజ్ యాత్రికులు విజయవాడ సెంటర్‌ను ఎక్కువగా ఎంచుకోవాలని హజ్ కమిటీ కోరుతోంది. ఇది రాష్ట్ర మైనారిటీ సంక్షేమంలో కీలక మైలురాయని బాషా చెప్పుకొచ్చారు.
Also Read:
శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..