Share News

AP Government: తోతాపురి రైతులకు రూ.260 కోట్లు

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:43 AM

తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరగా మొత్తం రూ. 260 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

AP Government: తోతాపురి రైతులకు రూ.260 కోట్లు

  • వాహనాలపై గ్రీన్‌ ట్యాక్సు తగ్గింపుపై ఆర్డినె న్స్‌

  • ‘కోకో’ మద్దతు ధర కింద 14.88 కోట్లు

  • ప్రస్తుత సీజన్‌లో 6.50 లక్షల టన్నుల మామిడి సేకరణ

  • రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

  • అమరావతిలో ఎమ్మెల్యేలు, అధికారులక్వార్టర్స్‌ పనుల పూర్తికి రూ.524 కోట్లు

  • రాజధానిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌

  • క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి

  • నేటి నుంచి రైతుల ఖాతాల్లో ధాన్యం బకాయిలు

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరగా మొత్తం రూ. 260 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రస్తుత సీజన్‌లో 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల తోతాపురి మామిడిని సేకరించడానికి ఆమోదం తెలిపింది. కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరగా మొత్తం రూ.260 కోట్లు మంజూరు చేసింది. అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (ఏక్యూసీసీ) పేరిట ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. క్యాబినెట్‌ నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.670 కోట్లను గురువారం నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణపై మంత్రుల కమిటీ రైతులను సంప్రదించాలని.. వారి సమస్యలు, ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని సీఎం సూచించారని చెప్పారు.రాష్ట్రాభివృద్ధికి భూసమీకరణ అవసరాన్ని వారికి వివరించాలని.. రైతులు, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని వారం, పది రోజుల్లో ప్రతిపాదనలు చేయాలని తెలిపారని వెల్లడించారు. రాష్ట్రాన్ని జగన్‌ అన్‌పాపులర్‌ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నారని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి, పెట్టుబడిదారులు రాకుండా చేయాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని సీఎం స్పష్టంగా ఆదేశించారని తెలిపారు.


మరిన్ని నిర్ణయాలు ఇవే..

  • అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న నివాస సముదాయం పనులు వేగవంతం. ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.524.70 కోట్లు మంజూరుకు, టెండర్ల ఖరారు అధికారాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ ఇవ్వడానికి ఆమోదం. సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల సమీక్షకూ సమ్మతించింది. అమరావతిలో 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాలు కేటాయించిన భూములకు కొన్ని సవరణలు చేశారు. కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాల కేటాయింపునకు అంగీకారం.

  • ప్రకాశం బ్యారేజీ ముందుభాగంలో వివిధ రీచ్‌ల్లో ఇసుక తొలగింపు పనికి రూ.286.20 కోట్లకు పరిపాలనామోదం.

  • జల వనరులశాఖలోని వివిధ చీఫ్‌ ఇంజనీర్ల అధీనంలో ఉన్న 71 ప్రాజెక్టుల పనులను కొనసాగించేందుకు సమ్మతి.

  • వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్‌ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ఆమోదం.

  • అమరావతిలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఏపీ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ సైబర్‌ రెసిలియన్స్‌ స్థాపనకు ఆమోదం.

  • జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్ర మ్యాచింగ్‌ షేర్‌ కోసం రూ.10 వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా సమీకరించడానికి ‘ఆంధ్రప్రదేశ్‌ జల్‌ జీవన్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌’ స్థాపనకు ఆమోదం.

  • సరుకు రవాణా, వాణిజ్య వాహనాలపై గ్రీన్‌ ట్యాక్సును తగ్గిస్తూ ఆర్డినె న్స్‌ జారీచేసేందుకు సమ్మతి.

  • అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సరిహద్దుల మార్పు.. ఏఎంఎన్‌ఎ్‌సఐ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపునకు పరిహారంగా అదనంగా 790 ఎకరాల భూముల సేకరణ.. ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు మొత్తం 2,001.80 ఎకరాల బదిలీ.. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు.. వీకే-పీసీపీఐఆర్‌-యూడీఏ ద్వారా లే-అవుట్‌ ఆమోదం చార్జీలు, భూవినియోగ చార్జీలకు మినహాయింపు.. ఏపీఐఐసీ, ఏపీబీడీఐసీ ద్వారా భూమి లీజు అద్దె, ఇతర యుటిలిటీ చార్జీల అమలు.. బల్క్‌ డ్రగ్‌ పార్కులో స్థాపించే యూనిట్లకు ప్రస్తుత విధానాల ప్రకారం ప్రోత్సాహకాల విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం.


  • 2025-30 కాలానికి ‘ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ పాలసీ 4.0’కు సమ్మతి.

  • బీపీసీఎల్‌ పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, ఇండోసోల్‌ సోలార్‌, ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ సెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్ట్‌ రెండో దశ, సంబంధిత లాజిస్టిక్స్‌, పారిశ్రామిక టౌన్‌షి్‌ప ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తికి కందుకూరు, కావలిలో ఒక స్పెషల్‌ కలెక్టర్‌ యూనిట్‌, 4 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల యూనిట్ల ఏర్పాటుకు సమ్మతి.

  • రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ కారణంగా జీవనోపాధి కోల్పోయిన మరో 1,575 నిరుపేద కుటుంబాలకు పెన్షన్‌ మంజూరు.

  • మార్క్‌ఫెడ్‌ ఇప్పటికే పొందిన రూ.6,700 కోట్ల రుణంతోపాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఇంకో వెయ్యి కోట్ల అదనపు రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ పొడిగింపు.

  • కోకో రైతులకు సరసమైన ప్రోత్సాహక ధరలు అందించడానికి ప్రభుత్వ మద్దతు ధరగా కిలోకు రూ.50 చొప్పున రూ.14.88 కోట్లు మంజూరు. ప్రస్తుత సీజన్‌లో అమ్ముడుపోని 2,976.76 మెట్రిక్‌ టన్నుల కోకో గింజల సేకరణకు ఆమోదం.

Updated Date - Jul 10 , 2025 | 03:43 AM