Andhra University : వ్యర్థ రక్తం నుంచి స్టెమ్ సెల్స్ విభజన
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:49 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పీజీ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు.

ఏయూ విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ
వెంకోజీపాలెం(విశాఖపట్నం), ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పీజీ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. ఆకెళ్ల మైథిలి, సింగుపురం ఇందు సంయుక్తంగా పరిశోధన చేసి స్టెమ్ సెల్స్, జెల్‌తో కూడిన 3డీ ఆకారాన్ని డిజైన్ చేశారు. పరిశోధనలో భాగంగా మహిళల రుతుస్రావం సమయంలో వెలువడే రక్తాన్ని సేకరించి, దానినుంచి బ్యాక్టీరియా, ఫంగస్ తొలగించి స్టెమ్ సెల్స్‌ను వేరు చేయడం ద్వారా తొలి అడుగు విజయవంతంగా వేశారు. సాధారణంగా ఎముక మజ్జతో పాటు మరికొన్ని భాగాల నుంచి స్టెమ్ సెల్స్ తీస్తారు. అయితే, వ్యర్థాల నుంచి స్టెమ్ సెల్స్‌ను వేరుచేయడం సరికొత్త విధానానికి రూపకల్పన చేసినట్లయింది. రెండో దశలో 3డీ బయో ప్రింటింగ్ మెషీన్ సహాయంతో వేరు చేసిన స్టెమ్ సెల్స్‌ను, (ఆరోగ్యానికి హాని చేయని) బయో కంపాటబుల్ జెల్స్‌ను వినియోగించి ఒక ఆకారాన్ని డిజైన్ చేశారు. భవిష్యత్తులో వివిధ అవయవాల సమస్యలతో బాధపడేవారికి వాటిని 3డీ ప్రింటింగ్ విధానంలో రూపొందించి అమర్చడంలో ఈ పరిశోధన కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.