Share News

AP Coastal Length : పెరిగిన ఏపీ తీరం పొడవు

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:27 AM

ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.70 కిలో మీటర్లుగా ఉన్న తీరం పొడవు 79.37 కి.మీ. (8.154 శాతం) పెరిగి 1053.07 కి.మీ.కు చేరింది.

AP Coastal Length : పెరిగిన ఏపీ తీరం పొడవు

  • తాజా లెక్కలతో 1053.07 కి.మీ.గా తీరం

  • 1970 లెక్కలతో పోల్చితే 79.37 కి.మీ. పెరుగుదల

  • దేశంలో మొత్తం 11,098.81 కి.మీ. తీర ప్రాంతం

  • గతంలో కంటే 48 శాతం పెరుగుదల నమోదు

  • మలుపులు, ఒంపులు లెక్కతో పెరిగిన పొడవు

  • కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.70 కిలో మీటర్లుగా ఉన్న తీరం పొడవు 79.37 కి.మీ. (8.154 శాతం) పెరిగి 1053.07 కి.మీ.కు చేరింది. అదే సమయంలో దేశం తీరం పొడవు 7,516.60 కి.మీ. నుంచి 11,098.81 (48 శాతం) కి.మీ.లకు పెరిగినట్టు తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్‌ నేవల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్‌, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 1970లో చేసిన సంయుక్త సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన ఇచ్ఛాపురం సమీపాన ఉన్న డొంకూరు నుంచి దక్షిణ భాగంలో తడ వరకు 973.7 కి.మీ. తీర ప్రాంతంగా గుర్తించారు. అయితే నేషనల్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌ రూపొందించిన విధి విధానాల మేరకు నిర్వహించిన రీ వెరిఫికేషన్‌లో ఏపీలో తీరం పొడవు 1,053.07 కి.మీ.కు పెరిగినట్టు హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడైంది. గతంలో ప్రతి 50 కి.మీ. మధ్య దూరాన్ని కొలిచారు. ఇప్పుడు ఐదు నుంచి పది కి.మీ.ల మధ్య దూరాన్ని కొలిచారు. అంటే 1970లో దూరాన్ని నేరుగా కొలవగా, ఇటీవల మలుపులు, ఒంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని విశాఖలో జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ వీవీఎ్‌సఎస్‌ శర్మ చెప్పారు. ఈ విధానం వల్ల ప్రతి అంగుళాన్ని కచ్చితంగా లెక్కించారని పేర్కొన్నారు.


మూడో స్థానానికి ఆంధ్రప్రదేశ్‌

తాజా నివేదిక వివరాల ప్రకారం.. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానం (గతంలో రెండో స్థానం)లో నిలిచింది. గతంలో ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ ఇప్పుడు 2,340.62 కి.మీ.ల పొడవుతో అదే స్థానంలో కొనసాగగా, 1,068.69 కి.మీ.లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. గతంలో దేశంలో తీర ప్రాంతం 7,516.60 కి.మీ.లుగా ప్రకటించారు. అయితే నేషనల్‌ మారిటైమ్‌ కో-ఆర్డినేటర్‌ రూపొందించిన కొత్త విధివిధానాలను అనుసరించి రీ వెరిఫికేషన్‌లో భారత తీరం పొడవు 3,582.21 కి.మీ. పెరిగి 11,098.81 కి.మీ.లకు చేరిందని వెల్లడైంది. ఏపీలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీర ప్రాం తంలో ఉన్నాయి. సముద్రతీరం పరిశీలిస్తే అనేకచోట్ల మలుపులు, ఒంపులు ఉన్నాయి. తీర రక్షణ బాధ్యత పూర్తిగా భారత నౌకాదళం పర్యవేక్షిస్తోంది. నేవీకి కోస్ట్‌గార్డు, రాష్ట్ర మెరైన్‌ పోలీసులు సహకరిస్తున్నారు.

Untitled-4 copy.jpg

Updated Date - Jan 07 , 2025 | 06:27 AM