Share News

Weather Conditions: నాలుగు రోజులు ఎండ వాన

ABN , Publish Date - May 04 , 2025 | 04:28 AM

రాష్ట్రంలో నాలుగు రోజులు ఎండావానలతో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పగలు ఎండ తీవ్రత, వడగాడ్పులు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Conditions: నాలుగు రోజులు ఎండ వాన

  • రాష్ట్రంలో విభిన్న వాతావరణం

  • పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు

  • మిగిలిన ప్రాంతాల్లో ఎండతీవ్రత..

  • రేపు, ఎల్లుండి ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల వానలు

అమరావతి, విశాఖపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా విదర్భ వరకూ, రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. దీనికితోడు సముద్రం నుంచి భారీగా తేమగాలులు భూ ఉపరితలంపైకి వీచాయి. వీటన్నింటి ప్రభావంతో శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కాకినాడలో 49.25, చిత్తూరు జిల్లా ఏటవాకిలిలో 48.5, అనంతపురం జిల్లా సొల్లాపురం, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 45 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో ఎండతీవ్రత కొనసాగింది. సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 41.5, పల్నాడు జిల్లా క్రోసూరులో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజులు ఎండావానలతో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చాలా చోట్ల పగలు ఎండ తీవ్రత, వడగాడ్పులు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 41.5-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ, మంగళ, బుధవారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.

Updated Date - May 04 , 2025 | 04:30 AM