Food Industry Boost: ఆహార శుద్ధి పరిశ్రమతో లబ్ధి
ABN , Publish Date - May 04 , 2025 | 04:40 AM
ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, గ్రామీణ యువతకు శిక్షణతో పాటు భారీ ప్రోత్సాహాలు అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. టమాటా వంటి పంటలకు విలువవద్దిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా కసరత్తు కొనసాగుతోంది
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఎంఎస్‌ఎంఈ రంగంతో ఈ యూనిట్ల అనుసంధానం
పంట ఉత్పత్తులకు అదనపు విలువ లభించే అవకాశం
ఆ దిశగా సరికొత్త పారిశ్రామిక పాలసీ కోసం కసరత్తు
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారిని ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం
తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్
మూడు నెలల కాలపరిమితితో ఔత్సాహికులకు శిక్షణ
పల్లెల్లోనే టమాటా ప్రాసెసింగ్ కేంద్రాలకు ప్రతిపాదన
ఈవోఐ ప్రాతిపదికన నిధుల మంజూరుకు కేంద్రం ఓకే
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు రుణ సదుపాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలు, మామిడి, మిరప, పసుపు తదితరాలతో పాటు కోస్తా జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. అందుకు అనువైన పరిస్థితులు, అపారమైన సహజ వనరులు అందుబాటులో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పాలని నిర్ణయించింది.
ఎంఎస్‌ఎంఈ రంగంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల్లో రైతులు పండించే పంటలకు అక్కడికక్కడే వాల్యూ ఎడిషన్ (అదనపు విలువ) లభించే దిశగా సరికొత్త పారిశ్రామిక పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చేందుకు తిరుపతి ఐఐటీ క్యాంప్‌సలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ అభ్యర్థులకు ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ మెలకువలను 3నెలల వ్యవధిలో నేర్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు రుణ సదుపాయం సైతం కల్పించనున్నారు.
రూ.50 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ కేంద్రాలు
టమాటా ఉత్పత్తుల కోసం పల్లెల్లోనే ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ‘ఆపరేషన్ గ్రీన్స్’ కార్యక్రమంలో భాగంగా టమాటా విరివిగా పండించే జిల్లాల్లో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీటి ఏర్పాటుకు డీపీఆర్‌ల ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రాతిపదికన నిధుల మంజూరుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఎంఎస్‌ఎంఈ రంగంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అనుసంధానం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రాష్ట్రంలో సొంత భూములు కలిగిన రైతులు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేవారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తే ఈ రంగం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం
Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్
Read Latest AP News And Telugu News