Share News

AP Govt Proposes Hybrid Model for Road Development: సెస్సులు వేసి రోడ్లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:08 AM

రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి/పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్‌ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు ఖర్చుకానుంది....

AP Govt Proposes Hybrid Model for Road Development: సెస్సులు వేసి రోడ్లు

  • సర్కారుకు ఆర్‌అండ్‌బీ ప్రతిపాదన

  • 1,500 కి.మీ. స్టేట్‌ హైవేల అభివృద్ధికి నిర్ణయం

  • మూడేళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం

  • వ్యయంలో ప్రభుత్వ వాటా రూ.4 వేల కోట్లు

  • నిధుల కోసం పెట్రోలు, డీజిల్‌, గనులు, రిజిస్ట్రేషన్లపై సెస్సు!

  • కాంట్రాక్టు సంస్థ వ్యయం 16 ఏళ్లలో తిరిగి చెల్లింపు

  • టోల్‌కూ అనుమతించాలన్న ఆర్‌అండ్‌బీ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి/పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్‌ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు ఖర్చుకానుంది. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థ (ఆర్డీసీ)కు చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇవ్వడంతోపాటు పెట్రోలు, డీజిల్‌, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, వాహన పన్నులపై సెస్సు విధించాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. ఆర్‌అండ్‌బీ నివేదికలో ఏముందంటే... ‘హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌’ (హ్యామ్‌) పద్ధతిలో 1500 కిలోమీటర్ల స్టేట్‌ హైవేల అభివృద్ధి/పునర్నిర్మాణ పనులను చేపడతారు. దీనికోసం ప్రభుత్వ నిధులతోపాటు కాంట్రాక్టర్లూ ఖర్చు పెడతారు. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 19 సంవత్సరాలు. తొలి ఏడాది 600 కిలోమీటర్లు, రెండో ఏడాది 600 కిలోమీటర్లు, మూడో ఏడాది 300 కిలోమీటర్ల చొప్పున రహదారులను నిర్మిస్తారు. ఇందులో 40 శాతం వాటా... రూ.4వేల కోట్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. భూ సేకరణ, పునరావాసం, ఇంకా ఇతర ఖర్చులు కూడా ఇందులో కలిపే ఉంటాయి. మిగిలిన 60 శాతం రూ.7761 కోట్ల ఖర్చును కాంట్రాక్టు సంస్థ భరిస్తుంది. ఆ ఖర్చును ప్రభుత్వం ఏటా దశల వారీగా వడ్డీతో కలిపి 16 సంవత్సరాలలో చెల్లిస్తుంది. రహదారి పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టరు టోల్‌ వసూలుకు కూడా అనుమతి లభిస్తుంది. ఇదంతా కలిపి... మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.22,826 కోట్లకు చేరుతుందని అంచనా!

నిధుల సేకరణ ఇలా...

‘హైబ్రిడ్‌’ రహదారి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు అవసరం. దీనికి నిధుల సమీకరణ కోసం భిన్న మార్గాలను యోచిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ పేర్కొంది. అందులో... ఆర్డీసీకి చెందిన భూములు, స్థిరాస్థులను లీజుకు ఇవ్వడం కూడా ఒకటి. ఇంకా... పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున సెస్సు విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా ఏటా రూ.732 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే... ఖనిజాలు, గనుల నుంచి 10 శాతం సెస్సు వసూలు చేస్తే ఏటా రూ.441 కోట్లు ఆదాయం లభిస్తుందని తేల్చారు. మోటార్‌ వెహికల్‌ ట్యాక్స్‌పై 10 శాతం సెస్సు విధించడం ద్వారా ఏటా కనీసం 350 కోట్లు రాబట్టాలని ప్రతిపాదించారు. ఓడ రేవులకు వచ్చే కార్గోపైనా, రిజిస్ట్రేషన్‌ చార్జీలపైనా ‘రోడ్డు సెస్సు’ విధించాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదించింది.


ఏటా రూ.375 కోట్ల టోల్‌ వసూలు...

‘హైబ్రిడ్‌’ రోడ్లపై టోల్‌గేట్ల ద్వారా ఏటా రూ.375 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అంతకంటే పెరగొచ్చు కూడా. ఈ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థ వసూలు చేసుకుంటుందని ఆర్‌అండ్‌బీ పేర్కొంది. రహదారుల నిర్మాణం పూర్తయి మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. అయితే... కేవలం 1500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.22వేల కోట్లు వ్యయం చేయడం, ప్రజల నుంచి సెస్సు వసూలు చేయాలని ప్రతిపాదించడం, టోల్‌గేట్లు పెట్టడం వంటి ప్రతిపాదనలపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తూ... మళ్లీ టోల్‌ వసూలు చేయాలన్న ప్రతిపాదనల్లో హేతుబద్ధత లేదని పేర్కొంటున్నారు. హైబ్రిడ్‌ ప్రాజెక్టులో ప్రభుత్వం, ప్రజలపై భారం ఉండకూడదని... ఈ ప్రాజెక్టు మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. గతంలో జగన్‌ హయాంలో రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు... ఆర్‌అండ్‌బీ చేసిన ప్రతిపాదనలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 27 , 2025 | 06:08 AM