APSPDCL: ఆ ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:23 PM
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అధికారులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు వెల్లడించారు. నెల్లూరు సర్కిల్ కు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) జె.రమణాదేవి, తిరుపతి సర్కిల్ కు చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&ఎం) సురేంద్ర నాయుడు, చిత్తూరు సర్కిల్ కు చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్ఎస్ & ఐపీసీ) ఉమాపతిని నోడల్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు.
తుపాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ఏపీఈపీడీసీఎల్(APEPDCL) పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీఎస్పీడీసీఎల్ నుంచి అధికారులు, సిబ్బంది(1,505 మంది)తో కూడిన 124 బృందాలు తరలివెళ్లాయని తెలిపారు. అదేవిధంగా ఏపీఈపీడీసీఎల్ కు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, ఏబీ స్విచ్చులు, క్రాస్ ఆర్మ్స్, కండక్టర్, ఏబీ కేబుల్ తదితర విద్యుత్ పరికరాలనూ తరలించినట్లు వివరించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు/సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. సంస్థ పరిధిలో సర్కిల్స్, డివిజన్స్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉత్తరాంధ్రతో సహా నెల్లూరు, కాకినాడ, తిరుపతి, గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తున్నాయి. తీరం వైపు తుపాన్ వచ్చేకొద్దీ వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసర ప్రయాణాలను మానుకోవాలంటూ సూచనలు చేసింది.
వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, విద్యుత్ వైర్ల కింద నిల్చోవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు/సిబ్బందికి గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా సంస్థ వాట్సాప్ నంబర్: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu On Railway Projects: రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Indian Railway: రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన