Cyber Crime Prevention: సైబర్ నేరగాళ్లకు చెక్
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:04 AM
సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఆన్‌లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్
2021లో ఏపీలో సైబర్ నేరగాళ్లు దోచింది 34 కోట్లు.. 2024లో ఏకంగా 974 కోట్లు దోపిడీ
ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు
ఇందులో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు
అధునాతన సైబర్ టూల్స్‌తో రంగంలోకి
అచ్యుతాపురం, సామర్లకోట ఘటనలతో డీజీపీ గుప్తా అప్రమత్తం.. వింగ్‌కు శ్రీకారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎక్కడో ఉంటూ రోజుకో కొత్త తరహా ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్న బూచోళ్ల ఆట కట్టించబోతున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో టెక్ నిపుణులైన పోలీసులను ఇందులో నియమించినట్టు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరిలోని పోలీస్ టెక్ టవర్ కేంద్రంగా పనిచేయనున్నారు. ఐజీ నేతృత్వంలో సైబర్ ఎస్పీ, ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 12మంది ఎస్‌ఐల తోపాటు ప్రతి జిల్లానుంచి బీటెక్ చేసిన పోలీసుల్ని సైబర్ కమెండోలుగా ఎంపిక చేశారు. అత్యంత అధునాతన సైబర్ టూల్స్‌తో నేరగాళ్లకు ఉచ్చు బిగించనున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి చోట్ల సైబర్ కేసులు నమోదవుతున్నాయి. అచ్యుతాపురం, సామర్లకోట ఘటనలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక సైబర్ వింగ్ ఏర్పాటుకు నాందిపడింది. జిల్లాకో సైబర్ సెల్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ మోసాల కట్టడికి చర్యలు తీసుకోవాలనుకున్న డీజీపీ గుప్తా.. రాష్ట్రవ్యాప్తంగా ‘ఈగల్’ (గంజాయి కట్టడి టీమ్) తరహాలో సైబర్‌వింగ్ ఏర్పాటుకు నిర్ణయించారు.
అచ్యుతాపురం, సామర్లకోటలో...
రెండునెలల క్రితం హోంశాఖ మంత్రి సొంత జిల్లా అనకాపల్లిలోని అచ్యుతాపురంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న వ్యక్తులను మోసం చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతను ఇక్కడికి తీసుకొచ్చి పలు దేశాల భాషలు నేర్పించి, ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చి, రోజూ వందల మందితో నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ప్రతినెలా 15కోట్ల నుంచి 20 కోట్ల వరకూ దోచేస్తున్న ఈ కేటుగాళ్ల ముఠాకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందని అనకాపల్లి ఎస్పీ పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే నెల క్రితం కాకినాడలో మ్యూల్ ఖాతాల బాగోతం వెలుగులోకి వచ్చింది. సామర్లకోటకు చెందిన పట్టాభిరామ్ దుబాయ్‌కి వెళ్లి అక్కడినుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన ఉదయ్ కిరణ్‌తో మాట్లాడి పలువురికి ఆశ పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. సైబర్ నేరాలతో దోచుకున్న డబ్బును ఆ ఖాతాల్లోకి మళ్లించి నగదు డ్రా చేసుకునేందుకు గాను, ఒక్కో ఖాతాదారుడికి రూ.30వేల వరకూ చెల్లించేలా మాట్లాడుకున్నాడు. ఈ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు 48మ్యూల్ ఖాతాల ద్వారా 8.80 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
సైబర్ నేరాలకు అడ్డాగా...
దేశంలో 81 శాతం సైబర్ మోసాలకు నాలుగు రాష్ట్రాల్లోని 10 జిల్లాలు అడ్డాగా మారాయి. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్, జాంతారా, బొకారో, కర్మటాండ్, గిరిధ్ ఈ జాబితాలో ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా సైబర్ మోసగాళ్లు ఉన్న జార్ఖండ్‌లోని ఈ ఐదు ప్రాంతాల నుంచే 26.6 శాతం మోసాలు జరుగుతున్నాయి. ఇక సైబర్ మోసాల్లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ఆల్వార్ నుంచి 23.1 శాతం, హరియాణాలోని నుహ్, గురుగ్రామ్ నుంచి 19.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి 12 శాతం జరుగుతున్నాయి. దేశంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భరత్‌పూర్ అగ్రస్థానంలో ఉండగా, మధుర, నుహ్ ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు దక్షిణాది నగరాలు, వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. దేశంలో సైబర్ బాధితుల నగరాల్లో బెంగళూరు (20 శాతం) మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. టాప్-10 నగరాల్లో చెన్నై కూడా ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం చిత్తూరు జిల్లాలో కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మరోవైపు విశాఖపట్నం లాంటి నగరాల్లోనూ సైబర్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది.
తెలుగు సీఎంల సొంత జిల్లాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ బాధితులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, చిత్తూరు జిల్లాలు నిలిచాయి. ఈ రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సొంత జిల్లాలు. ఇక ఏపీలో గత నాలుగేళ్లుగా సైబర్ నేరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సంఖ్య ఏటా రెట్టింపు అవుతోంది. ఓ సర్వే అంచనా ప్రకారం.. 2025లో ఏపీలో సైబర్ నేరాలు 75 శాతం పెరిగి 1500 కోట్లు దోచే అవకాశం ఉందని హెచ్చరించింది.
నేరాలు పెరగడానికి కారణాలు..
నిందితుల్లో మైనర్లు ఎక్కువగా ఉండటం, బెయిల్ సులభంగా లభించడం, అంతరాష్ట్ర ముఠాల ఆటకట్టించే వ్యవస్థ లేకపోవడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అత్యంత సహజంగా కనిపించేందుకు ఏఐ టూల్స్‌తో ఫిషింగ్ డొమెయిన్లు సృష్టించే అవకాశంఉంది. ఆర్థిక లావాదేవీలు, షేర్ మార్కెట్లో లాభాల ఆశ చూపుతూ గేలం వేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారాల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపు వరకూ ఏ అవకాశాన్నీ వదలట్లేదు.
ఎన్నెన్నో మోసాలు..
ఏటా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు అధికారుల పేరు చెప్పి ‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా.. ఓటీపీ చెప్పండి’.. ‘విద్యుత్‌బిల్లుల చెల్లింపులు చేయాలి’.. ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకు డిజిటల్ అరెస్టుల పేరిట బెదిరింపులకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో పడ్డ డబ్బులు దోచేసేందుకు సైబర్ నేరగాళ్లు వేసిన ఎత్తుగడ పోలీసు శాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరుకు చెందిన ఒక మహిళకు ఫోన్ చేసి.. ‘మీ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోండి.. గత ప్రభుత్వం ఒక ఏడాది ఆపేసిన అమ్మ ఒడి డబ్బులు కూడా అకౌంట్లో వేస్తాం’ అంటూ మభ్యపెట్టారు. ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న 20 వేలు కాజేశారు. ‘మీరు కరెంటు బిల్లు చెల్లించలేదు.. రాత్రి 9 గంటలకు కనెక్షన్ కట్ చేస్తాం’ అంటూ ఓ జిల్లా స్థాయి అధికారికి ఓ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. నిజమేనని భావించిన ఆయన ఉదయాన్నే చెల్లిస్తానని చెప్పేందుకు ఆ నంబర్‌కు తిరిగి కాల్ చేశారు. ‘ప్రస్తుతానికి 20 రూపాయలు పంపండి.. ఏదో చెల్లించినట్లు ఉంటుంది’ అని చెప్పడంతో.. 20 రూపాయలు చెల్లిస్తే ఏమౌతుందని భావించి పంపారు. అంతే.. ఆ అధికారి ఫోన్‌లోని స్ర్కీన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తంతో పాటు క్రెడిట్ కార్డును కూడా వాడేసి తెల్లారేలోపు 1.80 లక్షలు కాజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్