AP Govt: ప్రభుత్వ టెండర్లలో స్టార్టప్‌లకు అవకాశం
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:23 AM
స్టార్టప్ యజమానులకు గత అనుభవం లేకపోయినా, లక్షల రూపాయల టర్నోవర్ లేకపోయినా ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

రూ. 50 లక్షల విలువైన టెండర్లలో పాల్గొనవచ్చు
స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఐటీ వర్గాల హర్షం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్టప్ యజమానులకు గత అనుభవం లేకపోయినా, లక్షల రూపాయల టర్నోవర్ లేకపోయినా ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా టెండర్ విలువను బట్టి ఎర్నస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), టెండర్ డాక్యుమెంట్‌కు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీటిని కూడా చెల్లించనక్కర్లేదని స్పష్టంచేసింది. ఇలా రూ. 50 లక్షల విలువైన టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది. కేవలం ఐటీకి సంబంధించిన కాంట్రాక్టులే కాకుండా టెక్నాలజీతో ముడిపడిన ఎటువంటి పని అయినా చేపట్టవచ్చునని పేర్కొంది. వెబ్‌సైట్ల తయారీ, సాఫ్ట్‌వేర్ సేవలు, డ్రోన్ ఆపరేషన్ ఇలా ఏదైనా చేయవచ్చునని, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనే కాకుండా ఏపీలో అటానమస్ సంస్థలు, యూనివర్సిటీలు, డెవలప్‌మెంట్ అథారిటీలు, ప్రభుత్వ రంగ సంస్థల టెండర్లలో కూడా పాల్గొనవచ్చునని ప్రభుత్వం పేర్కొంది.
డీపీఐఐటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
దేశంలో ఎవరు స్టార్టప్‌ను ప్రారంభించినా డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఏపీలో సుమారుగా 1,400 స్టార్టప్‌లు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో దాదాపుగా 800 వరకు యాక్టివ్‌గా ఉన్నాయి. వారిలో ఎవరైనా ఏపీ ప్రభుత్వం కల్పించిన అవకాశం ఉపయోగించుకోవచ్చు. దీనిపై ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మూడింటిలో ఒకటి ఉన్నా చాలు
‘టెండర్లలో పాల్గొనే స్టార్టప్ గతంలో ఏదైనా పోటీలో పాల్గొని విన్నర్ లేదా రన్నర్ బహుమతి గెలిచి ఉండాలి. లేకుంటే ఏదైనా పేటెంట్ ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థ నుంచి గ్రాంట్ పొంది ఉన్నా సరిపోతుంది. మూడింటిలో ఒకటి ఉన్నాచాలు. మిగిలిన వారి కంటే ఆ స్టార్టప్‌లు మంచి ప్రతిభ చూపి ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం.’
- కొసరాజు శ్రీధర్, ఐటాప్ పూర్వ చైర్మన్
తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు
‘ప్రభుత్వం ఏదైనా వర్క్ కోసం టెండర్ పిలిస్తే పెద్ద సంస్థలు ఎక్కువకు కోట్ చేస్తాయి. అదే స్టార్టప్‌లైతే తక్కువ మొత్తానికే పని పూర్తి చేయడానికి ముందుకు వస్తాయి. దీని వల్ల ఇరు వర్గాలకు లాభదాయకం. టెండర్ పిలిచిన సంస్థకు ఖర్చు తగ్గుతుంది. స్టార్టప్‌కు ప్రాజెక్ట్‌తో పాటు అనుభవం వస్తుంది.’
- నరేశ్‌కుమార్, రుషికొండ ఐటీ పార్క్ సంఘం ఉపాధ్యక్షుడు