Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:03 AM
వడదెబ్బకు ఏ ఒక్కరు మృతిచెందకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు.
వడగాలి మృతులకు 4లక్షల పరిహారం: హోంమంత్రి అనిత
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాతావరణ మార్పులకు తగ్గట్టు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ వేసవిలో వడదెబ్బకు ఏ ఒక్క ప్రాణం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. వడదెబ్బకు మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వేసవి వాతావరణ పరిస్థితులపై మంగళవారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. వడగాడ్పులు, రానున్న వర్షాకాలానికి సంసిద్ధతపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ‘ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎండలు, వడగాడ్పుల ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామస్థాయిలో ‘ఆపదమిత్ర’లకు సీపీఆర్ సహా అన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలి’ అని అధికారులను ఆదేశించారు. వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్ సంపత్ తెలిపారు. వడడెబ్బ బారిన పడిన వారి కోసం 5,145 పడకలు, 768 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు వైద్య అధికారులు చెప్పారు. సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఎండీ కూర్మనాథ్, ఈడీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..