Share News

Satya Kumar Yadav: దేశంలో ఆయుష్‌ వైద్యానికి నవశకం

ABN , Publish Date - May 02 , 2025 | 06:30 AM

ఆయుష్ వైద్య సేవలను విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలను చెప్పిన మంత్రి సత్యకుమార్, గత ప్రభుత్వంలో ఈ రంగంపై నిర్లక్ష్యం ఉన్నదని చెప్పారు. ఆయుష్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు

Satya Kumar Yadav: దేశంలో ఆయుష్‌  వైద్యానికి నవశకం

  • 2014 నుంచి ఆ రంగానికి ప్రోత్సాహం

  • వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కుదేలు

  • తిరిగి జీవం పోసేందుకు కృషి చేస్తున్నాం

  • ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): దేశంలో ఆయుష్‌ వైద్య సేవల విస్తరణలో 2014 నుంచి నవశకం ప్రారంభమైందని, ఈ రంగంలో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు రాష్ట్రాలు ప్రయత్నాలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని పూణెలో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాచీన భారతీయ వైద్య విధానాల విశిష్టతపై అవగాహన ఉన్న ప్రధాని మోదీ.. ఆయుష్‌ వైద్య విధానాల్ని ప్రోత్సహించేందుకు 2014 నుంచి నడుంకట్టారని, దీని వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి అన్నారు. భారతీయ, అల్లోపతి వైద్య విధానాల మేళవింపుతో, సమీకృత ఆస్పత్రుల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


అభిప్రాయపడ్డారు. ఈ రెండింటి మేళవింపుతో ఏపీలో ఆస్పత్రుల స్థాపనకు పెట్టుబడుల సమీకరణతో పాటు మెడికల్‌ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాల దృష్ట్యా దీనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. భారతీయ వైద్య విధానానికి కేరళలో లభిస్తున్న ఆదరణ, ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం మద్దతుతో ఏపీలో ఆయుష్‌ వైద్య సేవలను విస్తృతం చేసి, ప్రజలకు పెద్దయెత్తున అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నా.. గత ప్రభుత్వం 2019-24 మధ్య ఈ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని అన్నారు. నిరాసక్తత కారణంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాలేదని, ఇతర రాష్ట్రాలు బాగా లబ్ధి పొందాయని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మొదటి రెండేళ్లలో ఆయుష్‌ రంగంలో నామమాత్రంగా నిధులు ఖర్చు చేశారని, తర్వాతి మూడేళ్లలో అయితే ఒక్క రూపాయి వెచ్చించలేదని తెలిపారు. ఆయుష్‌ వైద్యులు, ఇతర పోస్టుల్లో భారీగా ఖాళీలు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నామన్నారు. రాష్ట్రంలో కుదేలైన ఆయుష్‌ రంగానికి తమ ప్రభుత్వం జీవం పోయడానికి కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - May 02 , 2025 | 06:30 AM