Assembly Sessions : రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:08 AM
గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి

28న బడ్జెట్.. అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం అవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27 అసెంబ్లీకి సెలవు. 28న 2025-26 ఆర్థికసంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికిముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలియచేస్తారు. మార్చి 1, 2 సెలవులు. 3నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ కలర్ కోడ్‌లతో పాస్‌లు సిద్ధం చేశారు. గేట్-1 నుంచి మండలి చైౖర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంను అనుమతిస్తారు. గేట్-2 నుంచి మంత్రులు, గేట్-4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతి ఇస్తారు.