Paper Mill Workers : ఆంధ్ర పేపరు మిల్లు కార్మికుల సమ్మె విరమణ
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:26 AM
ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లు కార్మికులు వేతన ఒప్పందం కోసం చేపట్టిన సమ్మెను 9 యూనియన్లు విరమించుకున్నాయి.

9 యూనియన్లు అంగీకారం..
2 మాత్రం వ్యతిరేకం
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లు కార్మికులు వేతన ఒప్పందం కోసం చేపట్టిన సమ్మెను 9 యూనియన్లు విరమించుకున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణల చొరవతో సోమవారం రాత్రి పరిశ్రమల శాఖ అధికారులను తీసుకుని కార్మిక సంఘాలు, మిల్లు యాజమాన్య ప్రతినిధులతో సుమారు గంటపాటు చర్చించారు. దీంతో 9 యూనియన్లు సమ్మెను విరమించేందుకు అంగీకారం తెలిపాయి. వెంటనే మిల్లు యాజమాన్యం కూడా లాకౌట్‌ను ఎత్తివేసేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు మంగళవారం ఉదయం నుంచి విధులకు హాజరు కాబోతున్నారు. అయితే మొత్తం 11 యూనియన్లకు గాను 9 యూనియన్లు సమ్మెను విరమించేందుకు అంగీకరించగా, మరో రెండు యూనియన్లు వ్యతిరేకించాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేపరు మిల్లు కార్మికుల వేతన ఒప్పందానికి సంబంధించి సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నారని, మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందన్నారు. కార్మికులకు మంచి ఒప్పందాన్ని చేస్తుందని చెప్పారు. కాగా మిగిలిన రెండు యూనియన్ల వైఖరి మంగళవారం స్పష్టం కానుంది.