Handloom : బాపూ సంధించిన అస్త్రం.. చేనేత వస్త్రం..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:23 AM
చేనేత మగ్గం చరిత్ర ఎంతో ఘనం. ప్రతి భారతీయుడికి గర్వకారణం. స్వాతంత్య్ర సమరంలో బాపూ వాడిన అద్భుత అస్త్రం చేనేత వస్త్రం. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా గాంధీజీ రాట్నం వడికారు. అలా.. ఖాదీ ఉద్యమానికి నాంది పలికారు. తద్వారా ఆ నాడే చేనేత వసా్త్రనికి ..
స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక
ఖాదీ ఉద్యమంతో విదేశీ వస్త్ర బహిష్కరణ
నేటికీ వన్నె తగ్గని వస్త్రం
అద్భుత డిజైన్లతో ప్రపంచ వ్యాప్తం
ధర్మవరం నేతన్నకు ప్రత్యేక గుర్తింపు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
ధర్మవరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): చేనేత మగ్గం చరిత్ర ఎంతో ఘనం. ప్రతి భారతీయుడికి గర్వకారణం. స్వాతంత్య్ర సమరంలో బాపూ వాడిన అద్భుత అస్త్రం చేనేత వస్త్రం. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా గాంధీజీ రాట్నం వడికారు. అలా.. ఖాదీ ఉద్యమానికి నాంది పలికారు. తద్వారా ఆ నాడే చేనేత వసా్త్రనికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అందరి మన్ననలు పొందాయి చేనేత వసా్త్రలు. పట్టు చీరలు అన్ని దేశాల మగువల మనసులు దోచాయి. అంతటి చేనేత అంటేనే గుర్తొచ్చేది ధర్మవరం. పట్టుకేంద్రంగా పేరొంది. ఇక్కడి చేనేతల పనితనానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. కాలం మారినా.. ఎన్నో రకాల వసా్త్రలు మార్కెట్‌లోకి దూసుకొస్తున్నా.. చేనేతకు మాత్రం
ఆదరణ తగ్గలేదు. కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చేనేత వసా్త్రన్ని తిరుగులేని విజేతగా నిలుపుతున్నారు. ముడిసరుకుల ధరలు పెరుగుతున్నా.. మగ్గం గిట్టుబాటు కాకున్నా.. వదలట్లేదు. ధర్మవరం నేతన్నల జీవన విధానంగా మగ్గం మారిపోయింది. వంశపారంపర్య వృత్తిగా చేనేతను భావిస్తున్నారు. ధర్మవరం మగ్గంపై పురుడు పోసుకున్న వసా్త్రలను చూస్తే ఎవ్వరైనా మనసు పడేసుకోవాల్సిందే. 1905 ఆగస్టు 7వ తేదీన మహాత్మాగాంధీ రాట్నం తిప్పి, నూలు వడికి స్వదేశీ వసా్త్రన్ని స్వహస్తాలతో రూపొందించారు. దీంతో ఏటా ఇదే తారీఖున జాతీయ చేనేత దినోత్సవం చేసుకుంటారు. దీంతో గురువారం పట్టుకేంద్రం ధర్మవరంలో పెద్దఎత్తున వేడుకలు చేసుకోనున్నారు.
ఖండాంతరాలకు ఖ్యాతి
ధర్మవరం చేనేతల కళానైపుణ్యం అజరామరం. మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అద్భుతడిజైన్లను రూపొందిస్తూ ధర్మవరం పట్టుచీరకు మరింత వన్నె తెస్తున్నారు. ధర్మవరం పట్టుచీర దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. మనిషి వస్త్రధారణ మొదలు పెట్టినప్పట్నుంచి చేనేత నాగరికత ప్రారంభమైందంటే ఎంతటి ప్రాశస్త్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి చేనేత టెక్నాలజీని గుర్తించి వ్యాపారం చేయడానికి ఇండియాకు వచ్చిందంటే చేనేత పరిశ్రమ విశిష్టత ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు.
40 వేలదాకా మగ్గాలు
ఉమ్మడి అనంత జిల్లాలో 40వేలదాకా మగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి లక్ష మందికిపైగా నేతన్నలు జీవనం సాగిస్తున్నారు. చేనేతలతోపాటు రీలింగ్, ట్విస్టింగ్, డైయింగ్‌లు, డిజైనింగ్‌ల వారు కూడా దీనిపై అధారపడి జీవిస్తున్నారు. చేనేత రిజర్వేషన చట్టంలోని లొసుగుల వల్ల మరమగ్గాలు విచ్చలవిడిగా వెలసినా.. నేతన్న నేసిన పట్టుచీరకు ఇప్పటికీ గిరాకీ ఉండటం కళానైపుణ్యానికి నిదర్శనం. ప్రస్తుతం నేతన్న నేసిన చీరను కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీపడుతుండటం విశేషం.
డిజైనింగ్‌లో ఎదురేలేదు..
చేనేత పట్టుచీరకు డిజైనింగ్ ఎంతో ముఖ్యం. నూతన టెక్నాలజీని జోడించి పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో ధర్మవరం డిజైనర్లు పోటీ పడుతున్నారు. డిజైనింగ్‌లో తమకు సాటిలేరని నిరుపించుకుంటున్నారు. ఇప్పటికే మయూరి, పద్మారవింద, స్వర్ణకమలం, బ్రహ్మకమలం, గంధం, త్రీడీ, సుమాంజలి, కళాంజలి తదితర చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడి డిజైనర్లు మరో అడుగు ముందుకేసి దేవుళ్లు, దేవతల ప్రతిమలు, జాతీయ, అంతర్జాతీయ నేతలు, ప్రముఖులు, మేధావుల ప్రతిమలను వివిధ రూపాల డిజైన్లను పట్టు వస్త్రంపై రూపొందిస్తున్నారు.
భౌగోళిక గుర్తింపు
ధర్మవరం పట్టుపరిశ్రమ ప్రపంచ ఖ్యాతి గడించడంతో భారత ప్రభుత్వం భౌగోళిక గుర్తింపును 2014లో కల్పించింది. ఇక్కడ తయారుచేసే పావడాలు, పట్టుచీరలకే ఈ గుర్తింపు దక్కింది. ప్రాచుర్యం పొందిన పరిశ్రమను మరింత ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ గుర్తింపు కల్పిస్తారు. నేతన్నలు తయారుచేసిన పావడా, పట్టుచీరకు గుర్తింపునివ్వడం వల్ల పవర్‌లూమ్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ధర్మవరం చీరకు పేరు తీసుకొస్తా
పట్టుచీరల డిజైనింగ్‌పై ఉన్న మక్కువతో బెంగళూరు, హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. చేనేత కార్మికుడి సత్తాను జాతీయస్థాయిలో చాటాలనుకున్నా. ఇప్పటికే పలు డిజైన్లు రూపొందించి, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నా. ధర్మవరం పట్టుచీరకు మంచి పేరు తీసుకురావాలన్నదే నా చిరకాల కోరిక.
- నాగరాజు, డిజైనర్, ధర్మవరం