Share News

Land : రాబందులు వచ్చేశాయ్‌..!

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:35 AM

చిలమత్తూరు మండలంలోని టేకులోడు సెజ్‌లో దళారులు పాగా వేశారు. పరిశ్రమల కోసం ప్రభుత్వ చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతుల కంటే వీరే ఎక్కువ లబ్ధిపొందుతున్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. ఇందులో భాగంగా టేకులోడు రెవెన్యూ గ్రామంలో రైతుల నుంచి భూములను ...

Land : రాబందులు వచ్చేశాయ్‌..!
Lands being acquired by the government at Tekulodu

  • టేకులోడు సెజ్‌లో దళారులు పాగా

  • చిన్న వివాదాలతో రైతుల్లో ఆందోళన సృష్టి

  • సమస్యను

పరిష్కరిస్తామని రూ.లక్షల్లో వసూలు

  • ఇద్దరు అధికారుల అండతో సెటిల్‌మెంట్లు

చిలమత్తూరు మండలంలోని టేకులోడు సెజ్‌లో దళారులు పాగా వేశారు. పరిశ్రమల కోసం ప్రభుత్వ చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతుల కంటే వీరే ఎక్కువ లబ్ధిపొందుతున్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. ఇందులో భాగంగా టేకులోడు రెవెన్యూ గ్రామంలో రైతుల నుంచి భూములను సేకరించి వారికి పరిహారాన్ని అందిస్తోంది. ఇదే అదనుగా భావించిన కొందరు దళాలరుల అవతారం ఎత్తి అమాయక రైతులను భయపెట్టి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు దళారులకు అండగా ఉంటూ వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం.

చిలమత్తూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): టేకులోడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించింది. రైతులు సాగులో ఉన్న 600 ఎకరాల అసైన్డ భూములను సేకరిస్తోంది. ఎకరానికి రూ. 12,66,067లుగా ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తోంది. ఇదే అదనుగా కొందరు దళారుల అవతారం ఎత్తి అమాయక రైతులను టార్గెట్‌ చేస్తున్నారు. ప్రధానంగా చిన్న చిన్న భూసమస్యలు ఉన్న రైతులను గుర్తించి వారికి లేనిపోని భయాలను


పుట్టిస్తున్నారు. భూమి వివాదాస్పదంగా ఉందని, పరిహారం ఇవ్వడం కుదరదని తమతో కలిస్తే అధికారులతో మాట్లాడి పరిహారం అందేలా చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ తమతో కలిసిరాకపోతే మీ భూమికి పరిహారం వెనక్కి పోతుందని భయపెడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు దళారులు తీసుకువచ్చే వివాదాస్పద భూముల రైతులను మరింత భయపెడుతున్నారు. దీంతో అమాయక రైతులు పరిహారం రాదేమోనన్న ఆందోళనతో దళారీలు చెప్పినట్లు వింటున్నారు. రైతులను, తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులను ఒకచోట కూర్చోబెట్టి పరిహారం అందేవిధంగా చేస్తున్నందుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం.

సెటిల్‌మెంట్లతో రంగంలోకి..

టేకులోడు సెజ్‌లో భూవివాదాలు లేకపోయినా వారసులు, హక్కుదారులు అంటూ కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకుచ్చి కొత్త వివాదాలను సృష్టిస్తున్నారు. భూసమస్య ఉన్నట్లు తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీలు ఇప్పించి పరిహారం అందకుండా నిలుపుదల చేస్తున్నారు. అనంతరం సెటిల్‌మెంట్ల పేరుతో రంగంలోకి దిగుతున్నారు. ఎకరానికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు కమీషన మాట్లాడుకొని భూవివాదాన్ని సెటిల్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఓ ఇద్దరు అధికారుల పాత్ర క్రియాశీలకంగా ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.

ఆ ఇద్దరిదే కీలకపాత్ర!

వివాదాస్పదంగా ఉన్న భూములను టార్గెట్‌ చేస్తూ ఆ ఇద్దరు అధికారులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సామరస్యంగా పరిష్కారమయ్యే భూసమస్యలను పెద్దవిగా చేస్తూ రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. అన్నదమ్ములు, వారసులు, ఒకరు పట్టాదారుడుగా ఉంటూ సాగులో వేరే వ్యక్తి ఉండటం, నిజమైన హక్కుదారుడైనా రికార్డులో అపరిష్కృత భూమిగా ఉండటం వంటి విషయాలను గుర్తించి వారి నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాదు కూడదు అంటే రికార్డులు మాచేతుల్లో ఉంటాయి. పరిహారం అందకుండా చేయగలం అనే మాట చెప్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విధిలేక ఆ ఇద్దరు చెప్పిన మాటకి సరే అని డీల్‌కి ఒప్పుకుంటున్నారు.

రూ. లక్షల్లో డిమాండ్‌

వివాదాస్పదంగా ఉన్న భూ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ. లక్ష వరకు దళారులు ఆ ఇద్దరు అధికారులను కలుపుకొని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. పరిహార నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుండటంతో ఆ ఇద్దరి అధికారులకు ఇచ్చే వాటాకి దళారులే మధ్యవర్తిగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 600 ఎకరాల భూసేకరణలో 60 మంది రైతుల భూములు వివిధ కారణాలతో వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోజూ ఏదో ఒక కారణంతో అర్జీలు వస్తున్నట్లు చెప్తున్నారు. ఇలా అర్జీలు వచ్చిన భూములకు పరిహారం ఇవ్వడానికి బ్రేక్‌ పడుతోంది. ఆందోళనతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు సెటిల్‌మెంట్‌ చేసి పరిహారాన్ని పంచుకుంటున్నట్లు సమాచారం.

దళారులను నమ్మొద్దు: ఆనంద్‌కుమార్‌, పెనుకొండ ఆర్డీఓ

టేకులోడు సెజ్‌ భూముల పరిహారం పొందే విషయంలో ఎవరు దళారులను ఆశ్రయించవద్దు. సమస్య ఏదైనా ఉంటే మా వద్దకు తీసుకురావాలి. దళారులు చెప్పే మాటలు నమ్మి వారికి డబ్బులు ఇచ్చే పని చేయవద్దు. దళారులు చెప్పినవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరూ వినరు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. దళారులకు వెన్ను దన్నుగా కార్యాలయ సిబ్బంది ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. రైతులకు అందజేసే పరిహారం విషయంలో దళారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిస్తే చర్యలు తప్పక ఉంటాయి. రైతులు నేరుగా తహసీల్దార్‌కి కానీ, పెనుకొండలో నాకు కానీ సమస్య తెలుపుకోవచ్చు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాం.

(మరిన్ని అనంతపురం వార్తల కోసం..)

Updated Date - Aug 08 , 2025 | 12:35 AM