Rain Effect : కందిరైతుకు కన్నీరు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:40 AM
భారీ వర్షాలకు కంది పంట సర్వనాశనమైంది. మూడు నెలలపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట రైతులను నష్టాలపాలు చేసింది...
భారీ వర్షాలకు కుళ్లిన పంట
రూ.లక్షల్లో నష్టపోయిన అన్నదాతలు
పంటను తొలగించి.. ప్రత్యామ్నాయానికి ఏర్పాట్లు
విడపనకల్లు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు కంది పంట సర్వనాశనమైంది. మూడు నెలలపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట రైతులను నష్టాలపాలు చేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో జూలై నెలలో కంది సాగు ప్రారంభించారు. కొన్ని రోజులు వర్షాలు రాకపోవటంతో మొలక దశలోనే పంట ఎండిపోతుందని ఆందోళన చెందారు. ఆగస్టు నుంచి క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తుండటంతో భూమిలో తేమ ఆరనేలేదు. మిట్ట ప్రాంతాల్లో పంట బాగానే ఉన్నా, లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కుళ్లిపోయింది. మాళాపురం, పెద్ద కొట్టాలపల్లి గ్రామాల వద్ద కంది పొలాల్లో ఇప్పటికీ మోకాలు లోతు వర్షపు నీరు ఉంది. ఆ నీరు బయటకు పోతేనే పంటలు కోలుకుంటాయి. లేక పోతే కుళ్లిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటను తొలగిస్తున్న రైతులు
తట్రకల్లు రైతులు కంది పంటను తొలగిస్తున్నారు. పొలంలో నీరు నిలవడంతో ఇప్పటికే ఓ రైతు 5 ఎకరాలలో కంది పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. కొనకొండ్ల వద్ద కొందరు రైతులు పొలాల్లో నిలిచిన నీటిని వంకలకు మల్లించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఉరవకొండ డివిజనలో వందల ఎకరాల్లో కంది పంట కుళ్లిపోయింది. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట విత్తనాన్ని ఉచితంగా ఇచ్చి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
రూ.లక్ష నష్టం
వజ్రకరూరు మండలం రాగులపాడు రైతు కురుబ నాగేంద్ర నాలుగు ఎకరాల్లో కంది పంటను సాగు చేశాడు. ఎడతెరపి లేని వర్షాలకు ఇప్పటికే ఎకరం పొలంలో పంట పూర్తిగా కుళ్లిపోయింది. మిగిలిన మూడు ఎకరాల్లో అక్కడక్కడ కుళ్లిపోతోంది. పప్పుశనగ సాగు చేసే సమయం వరకూ వేచి చూస్తానని, ఆ తరువాత కుళ్లిన పంటను తొలగించి పప్పుశనగ, ఉలువ పంటలను సాగు చేసుకుంటానని బాధిత రైతు తెలిపారు. కంది పంట కుళ్లిపోవడంతో రూ.లక్ష వరకూ నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నవించారు.
ఏమీ మిగల్లేదు..
విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామానికి చెందిన చంద్రమోహన 25 ఎకరాల సొంత పొలం, 20 ఎకరాల కౌలు పొలంలో కంది పంటను జూలైలో సాగు చేశాడు. ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పొలంలో నీరు నిలిచి పంట కుళ్లిపోవడం మొదలైయింది. అయినా ఎండలు కాస్తే అంతో ఇంతో మిగులుందని భావించాడు. కానీ ఈనెలలో మరోమారు భారీ వర్షాలు కురవడంతో ఆశలు వదిలేయాల్సి వచ్చింది. కుళ్లిన పైరును పొలంలోనే వదిలేసి, ప్రత్యామ్నాయ పంట సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో కంది పైరు పూర్తిగా కుళ్లిపోయింది. రూ.5 లక్షలకు పైగా నష్టపోయాడు. మిగిలిన పంట పరిస్థితీ దారుణంగానే ఉంది.