Share News

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:57 PM

అత్తారింటిలో హిమజ(26) అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. స్నానాల గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుందని అత్తారింటివారు చెబుతుండగా, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి
Parents and villagers of the deceased at the scene

వరకట్న వేధింపుల కేసు నమోదు

సోమందేపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అత్తారింటిలో హిమజ(26) అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. స్నానాల గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుందని అత్తారింటివారు చెబుతుండగా, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. సోమందేపల్లి మండలం కేతగానిచెరువులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు, కేతగానిచెరువుకు చెందిన ఆదర్శ్‌తో ధర్మవరం పట్టణానికి చెందిన హిమజకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఆదర్శ్‌.. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మొదట్లో బాగానే ఉన్నా.. ఇటీవల అదనపు కట్నం కోసం హిమజను వేధించేవారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్నానానికి వెళ్లిన హిమజ, బాత్రూమ్‌లో గడియపెట్టుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి, గ్రామస్థుల సహకారంతో తలుపులు బద్ధలు కొట్టారు. అప్పటికే ఆమె మంటల్లో కాలిపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు, హిమజ తల్లిదండ్రులు సురే్‌షబాబు, విజయనిర్మలకు ఆదర్శ్‌ తెలియజేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను హత్యచేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని హిమజ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలంలో వస్తువులు చెల్లాచెదురు కాలేదని, ఆర్తనాదాలు వినిపించలేదని తెలిసిందని అనుమానం వ్యక్తం చేశారు. కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన, ఎస్‌ఐ రమే్‌షబాబు, తహసీల్దారు రెడ్డిశేఖర్‌, క్లూస్‌ టీమ్‌ సహకారంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులను విచారించారు. హిమజ భర్త ఆదర్శ్‌, మరిది సతీష్‌, అత్త సుశీలమ్మపై కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 11:57 PM