Share News

సిగ్గు.. సిగ్గు..!

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:30 AM

‘కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం..’ అంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే గొప్పలు చెబుతుంటారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం వివిధ పథకాలు తీసుకొచ్చి ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నాయి. పుస్తకాల నుంచి యూనిఫాం, చివరకు పౌష్టికాహారం వరకు సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా ...

సిగ్గు.. సిగ్గు..!
Ananthapur Deo Office

పరాయి భవనాల్లో విద్యాశాఖ, సమగ్రశిక్ష కార్యాలయాలు

శిథిలావస్థకు చేరుకోవడంతో భయంభయంగా విధులు

కనీస సౌకర్యాలు కరువు

ఖాళీ చేయాలంటూ సంబంధిత శాఖల ఒత్తిళ్లు

అనంతపురం విద్య, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం..’ అంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే గొప్పలు చెబుతుంటారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం వివిధ పథకాలు తీసుకొచ్చి ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నాయి. పుస్తకాల నుంచి యూనిఫాం, చివరకు పౌష్టికాహారం వరకు సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందజేస్తూ ప్రతినెలా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటి పాఠశాలలకు నిధులిచ్చి పర్యవేక్షించే విద్యాశాఖ, సమగ్రశిక్ష కార్యాలయాల పరిస్థితి మాత్రం జిల్లాలో దారుణంగా ఉంది. ఈ రెండు శాఖలకు సొంత భవనాలు లేవు. పరాయి


భవనాల్లో నడుపుతున్నారు. అక్కడ సరైన వసతులు లేకపోయినా ఆయాశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతూనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ భవనాలు ఇతర శాఖలకు చెందినవి కావడంతో వారు తమ భవనాలు ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెస్తుండడం శోచనీయం. ఇక వివిధ పనుల మీద ఆయా కార్యాలయాలకు వచ్చే టీచర్లు అక్కడ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పడుతున్న కష్టాలు చూసి షాక్‌ అవుతున్నారు.

ఎయిడెడ్‌ పాఠశాలలో..

ప్రభుత్వ శాఖల్లోనే అత్యధిక మంది ఉద్యోగులు విద్యాశాఖలో ఉంటారు. నెలకు సరాసరిగా ఈ శాఖకు చెందిన టీచర్లు, అధికారులు, ఉద్యోగులకు రూ.10కోట్లకుపైగా వేతనాల రూపంలో చెల్లిస్తారు. అలాంటి కీలక శాఖకు సొంత భవనంలేదు. కమలానగర్‌లోని సొంత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారులు వచ్చినపుడు మార్చాలని సీరియ్‌సగా ఉచిత సలహా ఇచ్చి వెళ్లారు. అద్దెలు కట్టలేమనడంతో గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌ ఎయిడెడ్‌ స్కూల్‌కు చెందిన ఓ భాగాన్ని మరమ్మతులు చేయించుకుని, అక్కడ కొన్నేళ్లుగా డీఈఓ కార్యాలయం నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న గదుల్లో జిల్లా అధికారులు ఉండాల్సి వస్తోంది.

సమగ్రశిక్షదీ ఇదే దుస్థితి..

పాఠశాలల అభివృద్ధి, కొత్తభవనాల నిర్మాణం, వసతుల కల్పన, కేజీబీవీలు, భవిత కేంద్రాలు, పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, రవాణాభత్యం తదితరాలను సమగ్రశిక్ష శాఖ ద్వారానే అందజేస్తారు. ప్రతినెలా ఆ శాఖ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, వివిధ కేడర్ల సిబ్బందికి రూ.3.50 కోట్లు జీతాల రూపంలోనే చెల్లిస్తున్నారు. భవనాలు, ల్యాబ్‌లు, డార్మెటరీలు, మైదానాలు, క్రీడలు తదితరాల నిర్మాణాలకు ఏటా కనీసం వందకోట్ల వరకు జిల్లాలో వ్యయం చేస్తున్నారు. అలాంటి సమగ్రశిక్ష శాఖ కార్యాలయానికి సొంత భవనం లేదు. గతంలో ప్రైవేటు అద్దె భవనాల్లో నడుపుతుండేవారు. అద్దె ఎందుకు చెల్లించాలని నగరానికి దూరంగా ఉన్న ఎస్సీ కార్పొరేషన శాఖకు చెందిన ఓ శిక్షణ కేంద్రంలో నడుపుతున్నారు. అక్కడ కూడా గదులకు పైకప్పులు రేకులతో వేసుకుని, కాలం వెల్లదీస్తున్నారు. వర్షంవస్తే అవి కారుతున్నాయి. భవనాలను ఖాళీచేసి వెళ్లాలని ఎస్సీ కార్పొరేషన శాఖ నుంచి ఒత్తిడి ఉంది. వేరే అవకాశం లేక అధికారులు, సిబ్బంది వాటిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా జిల్లాలో అత్యంత కీలకమైన విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖలకు సొంత కార్యాలయాలు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

పాత కార్యాలయం స్థానంలో నిర్మిస్తే అనుకూలం

కమలానగర్‌లో ఉన్న డీఈఓ పాత కార్యాలయాన్ని కూల్చి, అక్కడే విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏకి కొత్త భవనాలు నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. కీలకమైన కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం బాధాకరం. వెంటనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్తభవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.

-నాగేంద్ర, యుటీఎఫ్‌ సీనియర్‌ నేత

విలువైన స్థలాన్ని కాపాడాలి

కమలానగర్‌లో డీఈఓ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని వసతులులేని మరోచోట నిర్వహిస్తున్నారు. పాత కార్యాలయం స్థలంలో చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని, వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే కోట్ల విలువచేసే స్థలం అన్యాక్రాంతమవుతుంది. వెంటనే పాత కార్యాలయాన్ని పడగొట్టి, ఆ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి.

-కులశేఖర్‌ రెడ్డి, ఏపీటీఎఫ్‌ నేత

కొత్త కార్యాలయం నిర్మించాలి

డీఈఓ కార్యాలయంలో కనీస వసతుల్లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి పాలకులు, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.

- డీబీఎస్‌ ప్రకా్‌షరావు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకుడు

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం

డీఈఓ కార్యాలయానికి సొంతభవనం లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. స్వయంగా వచ్చి డీఈఓ కార్యాలయాన్ని పరిశీలిస్తానని కలెక్టర్‌ తెలిపారు. ఆ తర్వాతనే సొంతభవనం ఏర్పాటుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

-ప్రసాద్‌బాబు, డీఈఓ

Updated Date - Aug 25 , 2025 | 12:30 AM