Share News

నిస్వార్థ సేవాదళ్‌!

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:42 AM

నిస్వార్థ సేవలకు సత్యసాయి సేవాదళ్‌ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన గడ్కరీ, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యులు, ప్రతినిధులు కొనియాడారు. సత్యసాయి బోధనలే వారిని సేవామార్గంలో నడిపిస్తున్నాయని అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు మందిరంలో గురువారం శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు రత్నాకర్‌, చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన ..

నిస్వార్థ సేవాదళ్‌!
Union Minister Nitin Gadkari garlanding the Sathya Sai Mahasamadhi, with RJ Ratnakar next to him.

సత్యసాయి బోధనలతో భక్తుల సేవామార్గం

కొనియాడిన కేంద్ర మంత్రి గడ్కరీ, ట్రస్టు ప్రతినిధులు

ప్రశాంతి నిలయంలో సత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు

45 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధుల హాజరు

పుట్టపర్తి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నిస్వార్థ సేవలకు సత్యసాయి సేవాదళ్‌ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన గడ్కరీ, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యులు, ప్రతినిధులు కొనియాడారు. సత్యసాయి బోధనలే వారిని సేవామార్గంలో నడిపిస్తున్నాయని అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు మందిరంలో గురువారం శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు రత్నాకర్‌, చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి విద్యార్థుల వేద పఠనంతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి గడ్కరీ, మొదట సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సదస్సులో ప్రసంగించారు. సత్యసాయి జీవితం, బోధనలు, విలువలు, ప్రేమతత్వం, మానవాళిని శాంతిజీవనం వైపు నడిపిస్తున్నాయని అన్నారు. ఇక్కడి భక్తి, సేవలను చూసి.. మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రేరణ పొందాలని వచ్చానని తెలిపారు.

సేవాదళ్‌కు ముఖ్యమైన సదస్సు..

భగవాన సత్యసాయిబాబా అందించిన సేవ, ప్రేమ, స్ఫూర్తితో సేవాదళ్‌ సభ్యులు సేవలు నిర్వహిస్తున్నారని, నిస్వార్థసేవలకు వారు నిదర్శనంగా నిలుస్తున్నారని సత్యసాయి సేవాసంస్థల జాతీయ అఽధ్యక్షుడు నిమీష్‌ పాండే అన్నారు. సేవాదళ్‌ సభ్యులకు ఈ సదస్సు చాలా ముఖ్యమైనదని అన్నారు. భగవాన సత్యసాయి బాబా తన ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో లక్షల మంది భక్తులను సేవా మార్గంవైపు పయనించేలా చేశారని అన్నారు. సత్యసాయి సేవాదళ్‌ సభ్యులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ తమ ప్రాంతాలలో విద్య, వైద్యం, తాగునీరు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవలు, యువతకు ఉపాధిపై శిక్షణ, బాలవికాస్‌ విద్య ద్వారా బోధన అందిస్తున్నారని అన్నారు. సత్యసాయి మార్గమే తమకు శిరోధార్యం అని, అదే సేవాదళ్‌కు స్ఫూర్తి అని అన్నారు.

బాబా సేవలు ప్రపంచ వ్యాప్తం..

శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సుకు 45 దేశాల నుంచి 2500 మంది సేవాదళ్‌ ప్రతినిధులు హాజరయ్యారని సత్యసాయి సేవాసంస్థల యూకే ప్రతినిధి సురేశ మీనన అన్నారు. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు, సేవలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయని, భక్తులను సేవలపై నడిపిస్తున్నాయని అన్నారు. నేపాల్‌, ఇంగ్లండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ సహా పలు దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. సత్యసాయి సేవాదళ్‌ బ్రాంచలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి, నిస్వార్థ సేవలు అందిస్తున్నాయని తెలిపారు. 75 మంది విదేశీ డాక్టర్లు, 200 మంది భారతీయ డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. మనిషి హృదయమనే ఇంటిలో శాంతి అనే దీపం వెలిగించినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. దీనికోసం సేవాదళ్‌ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక బోధనలు కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం సత్యసాయి అంతర్జాతీయ సదస్సుపై ట్రస్టు ప్రతినిధులు పుస్తకాన్ని విడుదల చేశారు.

సౌకర్యాలు లేకపోయినా సేవకు..

ఎలాంటి అనుకూలత, వసతి లేనిచోట సత్యసాయి సేవాదళ్‌ సభ్యులు సేవా కార్యక్రమాలను అంకితభావంతో కొనసాగిస్తున్నారని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు నాగానందం అన్నారు. సత్యసాయి భక్తులు, సేవాదళ్‌ ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా భావిస్తారని అన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్తు, ఆపద ఎదురైనా అక్కడికి వెళ్లి అవసరమైన సేవలను అందిస్తారని కొనియాడారు. ప్రశాంతి నిలయంలో నేర్చుకున్నవాటిని ప్రచారం చేయడమే పరమావధిగా సత్యసాయి సేవాదళ్‌ సభ్యులు ముందుకు వెళుతున్నారని అన్నారు. సదస్సు అనంతరం సాయి కుల్వంతలో భక్తులు సంగీత కచేరీని నిర్వహించారు. అంతర్జాతీయ సదస్సుకు ట్రస్టు సభ్యులు డాక్టర్‌ మోహన, ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ, బీసీ జనార్దనరెడ్డి, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్‌ రాజు, మాజీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, గీతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన రెడ్డి, జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Nov 21 , 2025 | 12:42 AM