Share News

ఆర్డీటీకి భయం లేదు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:18 AM

శాసనసభ వేదికగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను లేవనెత్తారు. విద్యా, వైద్యానికి సంబంధించి తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేయించాలని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్య కళాశాలల విషయంలో వైసీపీ తీరును తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన కక్షపూరిత చర్యల వల్ల నేటికీ అనేకమంది ప్రభుత్వ....

ఆర్డీటీకి భయం లేదు
Minister Savita and MLAs with Nara Lokesh

సేవలు కొనసాగుతాయి

సీఎం మాటగా చెబుతున్నాం

ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల భరోసా

మంత్రి లోకేశతో భేటీ.. ఆర్డీటీపై చర్చ

అసెంబ్లీలో పలు సమస్యల ప్రస్తావన

శాసనసభ వేదికగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను లేవనెత్తారు. విద్యా, వైద్యానికి సంబంధించి తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేయించాలని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్య కళాశాలల విషయంలో వైసీపీ తీరును తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన కక్షపూరిత చర్యల వల్ల నేటికీ అనేకమంది ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారని, ఆ తప్పులను సరిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అనంతపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ సేవలకు ఎటువంటి ఆటంకం ఉండబోదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటగా తాము చెబుతున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేశను ఆయన కార్యాలయంలో మంత్రి సవిత, విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరారెడ్డి కలిశారు. ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అంశంపై మంత్రి నారా లోకేశతో చర్చించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారని, చాలామంది రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు నారా లోకేశ స్పందిస్తూ ఆర్డీటీని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. కేంద్రమంత్రి రామ్మోహననాయుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు. లోకేశను కలిసిన అనంతరం మంత్రి సవిత, కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఆర్డీటీ సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లాకు ఆర్డీటీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవన్నారు. అందుకే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థని అడ్డుపెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ సేవ్‌ అనంతపురం, సేవ్‌ ఆర్డీటీ నినాదంతో జిల్లా ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉన్నామన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేయించే బాధ్యత తమపై ఉందన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ దశాబ్దాలుగా విద్య, వైద్యాన్ని పేదలకు అందిస్తున్న ఆర్టీటీని ప్రజాప్రతినిధులమంతా ఐక్యమత్యంతో కాపాడుకుంటామన్నారు. వైసీపీ నేతలు రాజకీయ ఉనికి కోసమే ఆర్డీటీ అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్‌ రాజు మాట్లాడుతూ గత 56 సంవత్సరాలుగా ఆర్డీటీ అనేక సేవ కార్యక్రమాలు చేస్తోందన్నారు. పేదలకు గృహ నిర్మాణం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తోందన్నారు. రైతులకు పండ్ల మొక్కలు అందజేస్తూ హార్టికల్చర్‌ అభివృద్ధికి పాటుపడుతోందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4వేల గ్రామాల్లో ఎంతో మందికి ఆర్డీటీ సేవలు అందిస్తోందన్నారు. అలాగే 30 సంవత్సరాల పోరాటం అనంతరం చంద్రబాబు చేతుల మీదుగా ఎస్సీ వర్గీకరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశలు ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

శాపంగా వైసీపీ కక్షపూరిత చర్యలు

ఎమ్మెల్యే పరిటాల సునీత

వైసీపీ పాలనలో అనుసరించిన కక్షపూరిత చర్యలతో నేటికీ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను సరిచేసి, అర్హులందరికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె జీరో అవర్‌లో మాట్లాడారు. కొత్తగా ఇస్తున్న స్మార్ట్‌ రేషన కార్డుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా టీడీపీ సానుభూతిపరుల రేషనకార్డులు, పెన్షన్లు తొలగించారన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికి రేషనకార్డులు ప్రామాణికం కావడం వల్ల చాలా మందికి లబ్ధి చేకూరలేదన్నారు. హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, గ్రామ వలంటీర్లు చేసిన పొరపాట్ల వల్ల అనేక సమస్యలు వచ్చాయన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్నా అవి నమోదు చేయకపోవడం, విద్యుత బిల్లులు ఎక్కువగా చూపి వాటిని సరిచేయకపోవడం వంటివి జరిగాయన్నారు. వాటన్నింటిని తక్షణమే సరి చేయాలని కోరారు.

వైద్య విద్య పాపం వైసీపీదే: కాలవ

అనంతపురం క్రైం/రాయదుర్గం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన వైద్యవిద్యను ఖరీదైనదిగా మార్చిన పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన వైద్యరంగంపై మాట్లాడారు. పేదలకు అందాల్సిన సీట్లను ఎన్నారై, ఇతర కోటా పేరుతో రూ.20 లక్షలు, రూ.12 లక్షలకు పెంచినది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించినట్లు గొప్పలు చెబుతున్నారని, అయితే నేటికీ పునాది, మొండి గోడలకే పరిమితమైన వాటిని చూసి వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల ఫొటోలు అసెంబ్లీలో చూపుతూ వైసీపీ తీరును ఎండగట్టారు. ఐదేళ్లలో రాష్ర్టాన్ని అప్పులపాలు చేసి, అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించారంటూ ఫైర్‌ అయ్యారు. ఉమ్మడి ఏపీలో సీఎం చంద్రబాబు 17 మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తే... అందులో ఆరు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురంలో సైతం 2000 సంవత్సరంలో వైద్యకళాశాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కటీ ప్రారంభించలేదని మండిపడ్డారు. అలాగే రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో 22మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రిగా దీనిని మార్చారని తెలిపారు. అందుకు అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేసి, వైద్యులను నియమించాలని కోరారు.

బాబా జయంతికి ప్రత్యేక నిధులు ఇవ్వండి

ఎమ్యెల్యే పల్లె సింధూరా రెడ్డి

పుట్టపర్తి రూరల్‌: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రభుత్వాన్ని మంగళవారం కోరారు. శాసనసభ ప్రశో.త్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ కోట్లాది మంది ఆరాధించే సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నవంబరులో ప్రారంభమవుతాయని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరుచేయాలని విన్నవించారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్రపండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జాఈ చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జయంతి ఉత్సవాలకు దేశప్రధాని నరేంద్రమోదీతో పాటు దేశవిదేశాల నుంచి ప్రముఖులు రానున్నట్లు వెల్లడించారు. విద్యుత, తాగునీరు, డ్రైనేజీ, పట్టణ సుందరీకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి రూ.105 కోట్లతో డీపీఆర్‌ పంపినట్లు పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:18 AM