Share News

వాన వెల్లువ

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:35 AM

జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. హంద్రీనీవా నీటితో అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరు చెరువు పూర్తిగా నిండి, మూడు రోజుల కిందట మరువ పారింది. దీనికి వర్షపునీరు తోడవటంతో ప్రవాహం పెరిగింది. ఆ నీరు అనంతపురం రూరల్‌ మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విశ్వశాంతినగర్‌, గౌరవ్‌ రెసిడెన్సీస్‌, వికాస్‌ నగర్‌ ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రమైనా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాం...

వాన వెల్లువ
Vishwashanti Nagar submerged in water

ఉధృతంగా ప్రవహించిన ఆలమూరు చెరువు మరువ

రుద్రంపేట పరిధిలోని

పలు కాలనీలు జలమయం

వరదలో చిక్కుకున్న విశ్వశాంతి నగర్‌

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

11 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

పలు ప్రాంతాల్లో పంట నష్టం

మరో ఐదు రోజులు వర్షాలు

వాన దంచికొట్టింది. జిల్లాలోని చాలా మండలాల్లో గురువారం రాత్రి ఎడతెరపి లేని వాన కురిసింది. పలు వంకలు, వాగులు ఉప్పొంగాయి. అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరు చెరువు మరువ ఉధృతంగా ప్రవహించడంతో రుద్రంపేల పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. విశ్వశాంతి నగర్‌ వదర నీటిలో చిక్కుకుంది. కాలనీవాసులు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరో ఐదురోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో జనం వణికిపోతున్నారు. విశ్వశాంతి నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న 11 మందిని అగ్నిమాపక శాఖాధికారులు రక్షించారు.

అనంతపురం రూరల్‌, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. హంద్రీనీవా నీటితో అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరు చెరువు పూర్తిగా నిండి, మూడు రోజుల కిందట మరువ పారింది. దీనికి వర్షపునీరు తోడవటంతో ప్రవాహం పెరిగింది. ఆ నీరు అనంతపురం రూరల్‌ మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విశ్వశాంతినగర్‌, గౌరవ్‌ రెసిడెన్సీస్‌, వికాస్‌ నగర్‌ ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రమైనా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసిపోయాయి. ఈక్రమంలో మండల పరిషత, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లలోకి నీరు వెళ్లకుండా ఎక్స్‌కవేటర్లతో స్థానికంగా ఉన్న కాలువలోకి మళ్లించారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వారికి అగ్నిమాపక శాఖ సిబ్బంది రోప్‌ సాయంతో తీసుకొచ్చారు. అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. నష్టం వివరాలను రెవెన్యూ అధికారులు.. స్థానికుల ద్వారా సేకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరికుమార్‌, ఎంపీడీఓ దివాకర్‌, సీఐ జగదీష్‌ పాల్గొన్నారు. కొడిమి గ్రామ సమీపంలో రాచానపల్లి వంక ఉధృతంగా ప్రవహించింది. దీంతో జర్నలిస్టుల కాలనీ, దర్గాకొట్టాల తదితర ప్రాంతాల ప్రజలు నగరానికి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.

11 మందిని కాపాడిన ఫైర్‌ సిబ్బంది

అనంతపురం క్రైం: వరద నీటిలో ఇళ్లలో చిక్కుక్కున్న 11 మందిని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రుద్రంపేట పంచాయతీలోని విశ్వశాంతినగర్‌లోకి వరద నీరు భారీగా వచ్చింది. ఇళ్లను చుట్టుముట్టింది. ఆలమూరు ప్రధానరహదారి నుంచీ రుద్రంపేట 4వ సచివాలయం, వికాస్‌ నగర్‌ ఏరియాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వరద నీరు విశ్వశాంతి నగర్‌లోని పలు ఇళ్లలోకి చేరడంతో బయటకు వచ్చేందుకు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశ్వశాంతినగర్‌లోని డోర్‌ నంబర్‌ 5-12లో ఉంటున్న రమేష్‌ (32), లతాంజలి(27), రామాంజనేయులు(60), ఈశ్వరమ్మ(55), జస్విన(6), రెండున్నరేళ్ల హన్విత, డోర్‌ నంబర్‌ 5-13లోని బ్రహ్మయ్య(37), శాంతమ్మ(65), సునీత(34), 15 నెలల వయసున్న మోక్షిత, మోక్షితనందను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో జిల్లా అదనపు అగ్నిమాపక అధికారి లింగమయ్య, లీడింగ్‌ ఫైర్‌మన చిన్న వెంకటరాముడు, ఫైర్‌మెన ప్రకా్‌షనాయుడు, గంగాధర్‌, ప్రసాద్‌, బాలవెంకటయ్య, వెంకటనాయుడు, డీపీఓ రాఘవేంద్ర పాల్గొన్నారు.

రాప్తాడులో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం

అనంతపురం అర్బన: జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం వర్షం కురిసింది. అత్యధికంగా రాప్తాడు మండలంలో 9.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యల్లనూరు 7.8, అనంతపురం 7.1, శింగనమల 6.0, బుక్కరాయసముద్రం 5.0, తాడిపత్రి 4.6, పెద్దవడుగూరు 4.1, నార్పల, యాడికి 4.0, కూడేరు 3.9, ఆత్మకూరు 3.1, పెద్దపప్పూరు 2.6, రాయదుర్గం 2.1, గార్లదిన్నె, ఉరవకొండ, కళ్యాణదుర్గం 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 1.6 సెంటీ మీటర్లలోపు వర్షపాతం నమోదైంది.

పంటనష్టం

యల్లనూరు మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో యల్లనూరు సమీపంలోని ఎర్రవంక, కట్టుకాలువ, నడిమివంక ఉధృతంగా ప్రవహించడంతో యల్లనూరు చెరువు నిండింది. చెరువు మరువ పారడంతో పాతపేటలోని 100 ఎకరాల్లో కోత దశలోని వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. యల్లనూరు, కృష్ణాపురం, పాతపల్లిలో 60 ఎకరాల్లో కోత కోసి ఆరబెట్టిన మొక్కజొన్న పంట వర్షపు నీటితో తడిసింది. యాడికి మండలం వేములపాడులో హెక్టారులో రూ.2 లక్షల విలువైన టమోటా పంటకు నష్టం వాటిల్లింది. ఆత్మకూరులో 1.6 హెక్టార్లల్లో రూ.4 లక్షల విలువైన అరటి పంటకు నష్టం వాటిల్లింది. శెట్టూరు మండలంలో హెక్టారులో రూ.1.5 లక్షల విలువైన అరటి పంట దెబ్బతింది. కంబదూరు మండలంలో 1.2 హెక్టార్లలో రూ.లక్ష విలువైన బీర పంట దెబ్బతింది.

రానున్న ఐదు రోజుల్లో వర్ష సూచన

బుక్కరాయసముద్రం: రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు 28-30.4 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22-23.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈశాన్యం దిశగా గాలులు గంటకు 8-12 కి.మీ., వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం పూట 84-87, మధ్యాహ్నం 58-80 శాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న ఐదు రోజుల్లో అనంతపురం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 25న 2.2 సెం.మీ.లు, 26న 0.52, 27న 0.10, 28న 0.40, 29న 0.25 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో 25న 2.2 సెం.మీ., 26న ఒక సెం.మీ., 27న 0.5 సెం.మీ., 28న 0.12 సెం.మీ., 29న 0.17 సెం.మీ, వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:35 AM