Share News

Student Harassed: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ABN , Publish Date - Dec 04 , 2025 | 08:46 AM

ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల అలసత్వమే తమ బిడ్డ మృతికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

Student Harassed: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
Student Suicide in Sri sathya Sai District

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో కన్నుమూసిన ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. పోలీసుల నిర్లక్ష్యమే తమ కుమార్తెను బలి తీసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు (Student Harassed in Sri Sathya Sai District)

పులేటిపల్లి గ్రామానికి చెందిన అమల, ఆంజనేయులు దంపతుల కుమార్తె స్పందన ధర్మవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. చెన్నెకొత్తపల్లి మండలం ముష్టికోవేల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ధర్మవరంలోని మరో కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే, బస్సులో కాలేజీకి వెళ్లివచ్చే క్రమంలో తరుచూ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వైఖరి మార్చుకోవాలని విద్యార్థిని ఆమె హెచ్చరించింది. దీంతో ఆ విద్యార్థి నానా దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా బస్సులోనే విద్యార్థినిపై దాడి చేశాడు. ధర్మవరంలో బస్సు దిగి కాలేజీకి వెళ్తున్న సందర్భంలోనూ మరోసారి విద్యార్థినిపై దాడి చేశాడు. దీంతో బాధిత విద్యార్థిని అతడిపై ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఘటన చెన్నేకొత్తపల్లి పరిధిలో జరిగిందని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. దీంతో, బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి చెన్నెకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.


అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ధర్మవరం వన్ టౌన్ పీఎస్‌తో పాటు చెన్నెకొత్తపల్లి పోలీసులు కూడా ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నవంబరు 26న ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందింది. పోలీసుల అలసత్వం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు.


ఇవీ చదవండి:

విశాఖకు మరో గ్లోబల్‌ డేటా సెంటర్‌

చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ

Updated Date - Dec 04 , 2025 | 10:52 AM