తాడిపత్రికి పెద్దారెడ్డి.. కష్టమే..!
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:49 AM
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా పెద్దారెడ్డి అనుసరించిన వైఖరి వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడినట్లు పట్టణ ప్రజ లు చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలోకి వెళ్లడం, అతడి అనుచరులపై అనేక కేసులు పెట్టించడం, జేసీ ముఖ్య అనుచరుడు ఎస్వీ ...
రానివ్వమంటున్న జేసీపీఆర్, టీడీపీ శ్రేణులు!
శాంతిభద్రతల సమస్యతో పోలీసుల అడ్డగింత
కోర్టు ఉత్తర్వులతో నీరుగారిన కేతిరెడ్డి ఆశలు
ఇరువర్గాల్లో ఫ్యాక్షన, కేసుల భయం
తాడిపత్రి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా పెద్దారెడ్డి అనుసరించిన వైఖరి వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడినట్లు పట్టణ ప్రజ లు చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలోకి వెళ్లడం, అతడి అనుచరులపై అనేక కేసులు పెట్టించడం, జేసీ ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టిరవిని ఐదేళ్లపాటు తాడిపత్రిలోకి రానీయకపోవడం తదితర కారణాలు పెద్దారెడ్డి రాకకు ప్రతిబంధకంగా మారాయి. అలాగే నాలుగు
దశాబ్దాల జేసీ కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి పెద్దారెడ్డి రాకతో 2019లో గండిపడింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానీయకూడదన్న ఆలోచన జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో అలా.. ఇప్పుడిలా..
ప్రభోదానంద వివాదం(2017)లో నమోదైన కేసులను టీడీపీ పాలనలో కొట్టేయించుకోకపోవడం అప్పట్లో పెద్దారెడ్డికి బాగా కలిసి వచ్చింది. ఆ కేసులను ఆసరా చేసుకొని జేసీ ముఖ్యఅనుచరులు, టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ సంఘటనలే ఇప్పుడు పెద్దారెడ్డికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. గతంలో ప్రభోదానంద కేసు పెద్దారెడ్డికి ఎలా కలిసివచ్చిందో.. ఎన్నికల ఘర్షణలు కేసులు ప్రస్తుతం మున్సిపల్ చైర్మనకు కలిసి వచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. జేసీ, పెద్దిరెడ్డి మధ్య ఘర్షణ వైఖరితో పోలీసులు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏదో ఒక ప్రోగ్రాంతో అడ్డగింత
పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాలనుకున్న ప్రతిసారీ మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పట్టణంలో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు ఆయన్ను అడ్డుకుంటున్నారు. దీంతో తాడిపత్రికి వెళ్లడానికి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి పర్మిషన తెచ్చుకున్నారు. అదే రోజే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలోని ఫ్లైఓవర్ వద్ద అనంతపురం రహదారిలో ధ్యానశివుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు, శ్రేణులు, జేసీ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో తాడిపత్రికి పెద్దారెడ్డి వెళితే రక్షణ కల్పించడం కష్టమతుందన్న భావనతో కోర్టు ఆర్డర్ ఉన్నా పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను వెళ్లి తీరాల్సిందేనని పెద్దారెడ్డి దాదాపు 7 గంటల పాటు రోడ్డుపైన బైఠాయించారు. అయినా పోలీసులు అనుమతించకపోవడంతో విధిలేని పరిస్థితిలో వెనక్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే రక్షణ కల్పించలేమని హైకోర్టులో పిటీషన వేశారు. దీంతో అంతకుమునుపు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్‌బెంచ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ డివిజన బెంచ తీర్పు ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికలకు కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం కష్టమన్న భావన కలుగుతోంది. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు జరిగి మళ్లీ ఎక్కడ ఫ్యాక్షన ప్రారంభమవుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ప్రస్తుత రాజకీయాలు కక్షపూరితంగా మారాయని సామాన్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసుల భయంతో చోటామోటా నాయకులు సతమతమవుతున్నారు.