Free Bus : ఆనంద కాంతులు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వారిలో ఆనందకాంతుల్ని నింపుతోంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఉచిత బస్సులను అట్టహాసంగా ప్రారంభించారు. దీంతో శనివారం నుంచి మహిళలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చేతుల్లో ఆధార్, రేషన కార్డు వంటివి పట్టుకుని కండక్టర్ల వద్ద ఫ్రీ టికెట్లు తీసుకుని బస్సు..
ఫ్రీ బస్సు ప్రయాణంతో మహిళల సంబరం
అనంతపురం టౌన/ నెట్‌వర్క్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వారిలో ఆనందకాంతుల్ని నింపుతోంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఉచిత బస్సులను అట్టహాసంగా ప్రారంభించారు. దీంతో శనివారం నుంచి మహిళలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చేతుల్లో ఆధార్, రేషన కార్డు వంటివి పట్టుకుని కండక్టర్ల వద్ద ఫ్రీ టికెట్లు తీసుకుని బస్సుల్లో తమ గమ్యస్థానాల వైపు వెళ్లారు. రీజియనలోని 7 డిపోల పరిధిలో కలిపి రోజుకు సరాసరి 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా శనివారం ఆ సంఖ్య 2.10 లక్షలకు పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. సెలవులు ముగిసిన తర్వాత సోమవారం ఈ సంఖ్య మరింతగా పెరిగే
అవకాశముందంటున్నారు. రీజియన వ్యాప్తంగా 470 ఆర్టీసీ బస్సులుండగా 374 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. జిల్లా కేంద్రం నుంచి పావగడ, చెళికెర, బెంగళూరు తదితర రాష్ట్ర సరిహద్దుల్లోని ఊర్లకు వెళ్లే వారు కర్ణాటక బస్సులు ఎక్కకపోవడంతో అవి ఖాళీగా వెళ్లడం కలనిపించింది.
స్పందన బాగా ఉంది : శ్రీలక్ష్మి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్
కొత్తగా ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి స్పందన బాగా ఉంది. సాధారణ రోజులతో పోలిస్తే శనివారానికి రీజియన వ్యాప్తంగా 5 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. సెలవులు ముగిసిన తర్వాత సోమవారం నుంచి ఆక్యుపెన్సీపై స్పష్టత వస్తుంది. ఇక రీజియన వ్యాప్తంగా రోజుకు రూ.80లక్షల ఆదాయం ఉండేది. ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి కనుక ఈ ఆదాయం సరాసరి సగానికి తగ్గే అవకాశముంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించేటపుడు ప్రూఫ్‌గా ఆధార్ లేదా రేషన కార్డు లేదా ఓటర్ కార్డు ఏదో ఒకటి ఒరిజినల్‌ను ఖచ్చితంగా తమవద్దనే ఉంచుకోవాలి.
స్త్రీశక్తికి సరిహద్దు
రాయదుర్గం/బొమ్మనహాళ్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం అందక రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాయదుర్గం నుంచి బళ్లారి, మొలకాల్మూరు ప్రాంతానికి రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ కూడా పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులను నడుపుతోంది. ఈ బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులు కావడంతో ఇందులో ప్రయాణించే మహిళలు చార్జీ చెల్లించక తప్పడం లేదు. రాయదుర్గం నుంచి బళ్లారి 48 కి.మీ. ఉన్నప్పటికీ ప్రయాణించే మధ్యలో కల్యం, బాదనహాళ్, హడగలి, సోమలాపురం, వసగుడ్డం, పులకుర్తి, మల్లికేతి, హిర్దేహాళ్, ఓబుళాపురం చెక్‌పోస్ట్, కణేకల్లు నుంచి బళ్లారికి 50 కి.మీ. ఉన్నప్పటికీ కణేకల్లు క్రాసింగ్, యర్రగుంట, గెణిగెర, గోనేహాళ్ గేట్, రంగాపురం, ఉద్దేహాళ్, ఉంతకల్లు, ఎల్‌బీనగర్, బొమ్మనహాళ్ గ్రామాల మీదుగా వెళ్లాలి. ఆయా రూట్లలలో నడిచే ఆర్టీసీ బస్సులన్నీ అంతర్రాష్ట్ర సర్వీసులే. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ ఆయా గ్రామాల మహిళలకు వర్తించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం నుంచి బళ్లారి వైపున 13 పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు బళ్లారి మీదుగా వెళ్లే శ్రీశైలం, కర్నూలు ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందే. రాయదుర్గం డిపోలో 59 సర్వీసులు ఉండగా అందులో 18 సర్వీసులు అంతర్రాష్ట్ర ప్రాంతాలకు తిరిగేవి. ఈ నేపథ్యంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టినప్పటికీ రాయదుర్గం నియోజకవర్గంలోని చాలా గ్రామాల మహిళలకు వర్తించడం లేదు.
ఫ్రీ బస్సుతో డబ్బులు ఆదా
నేను వివిధ గ్రామాలు తిరుగుతూ పూలు అమ్ముతుంటా. గ్రామం నుంచి పూల కోసం ప్రతి రోజూ అనంతపురం మార్కెట్‌కు బస్సులో వస్తా. ఇందుకోసం రూ.55లు చార్జీ అవుతుంది. పూలు మార్కెట్‌లో కోనుగోలు చేశాక అదే బస్సుకు వెళ్లేదాన్ని. ఇలా రోజు రూ.110 చార్జీ అయ్యేది. ఇప్పుడు ఫ్రీ బస్సుతో మొత్తం డబ్బులు మిగులుతాయి.
- బోయ నారమ్మ , నాయనవారిపల్లి, శింగనమల మండలం
పేదలకు మేలు
ఉరవకొండ నుంచి కూడేరుకు ఉచితంగా ప్రయాణించా. దీంతో నాకు రాను, పోను బస్సు చార్జీలు రూ. వంద మిగిలాయి. మాలాంటి కూలి పనులు చేసుకొనే పేదలకు ఈ పథకం ఎంతో మేలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పథకం పేదలకు వరం లాంటిది.ఙ
- సాకే లక్ష్మి, పాల్తూరు గ్రామం,
ఉరవకొండ మండలం
ఎంతో మేలు
కొర్రకోడు గ్రామం నుంచి అనంతపురం పట్టణానికి బస్సులో వెళ్లాలంటే చార్జీ రూ.70 అవుతుంది. అనంతపురం నుంచి కూడేరుకు శనివారం ఉదయం నా కుమారుడితో కలిసి ప్రయాణించా. నాకు చార్జీల డబ్బు ఆదా అయ్యింది. మాలాంటి పేదలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. ఆపదలో డబ్బులు లేకపోయిన బస్సులో ఉచితంగా వెళ్లడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది.
- రోజా, కొర్రకోడు గ్రామం, కూడేరు మండలం
చేతులెత్తి మొక్కుతున్నాం
ప్రతి రోజు కళ్యాణదుర్గం మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో పాల్తూరుకు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటా. ఇలా రానుపోను బస్సు టిక్కెట్టుకు రూ.60లు అయ్యేది. మా లాంటి చిన్న వ్యాపారం చేసుకునే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరిగేందుకు అవకాశం ఇచ్చిన చంద్రబాబునాయుడుకు చేతులెత్తి మొక్కుతున్నాం. ఆ టిక్కెట్టుకు ఇచ్చే రూ.60లతో ప్రశాంతంగా అన్నం తింటా.
- రామలక్ష్మి, కూరగాయల వ్యాపారి, పాళ్లూరు, కంబదూరు మండలం