MURDER MISTRY: అడ్డు తొలగించుకునేందుకే హత్య
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:26 AM
వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యే.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానిక రహమతపురానికి చెందిన అల్లాబకష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
హిందూపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యే.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానిక రహమతపురానికి చెందిన అల్లాబకష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అల్లాబకష్ భార్య తబస్సుం, ఆమె ప్రియుడు నదీముల్లాను అరెస్టు చేశారు. స్థానిక పోలీసు స్టేషన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అరెస్టు వివరాలను టూటౌన సీఐ అబ్దుల్ కరీం వెల్లడించారు. అల్లాబక్‌షకు తొమ్మిదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురానికి చెందిన తబస్సుంతో వివాహమైంది. అల్లాబకష్ ఆటోనగర్‌లో బీరువాలు తయారుచేసే షాపులో పనిచేస్తుండేవాడు. రహమతపురానికి చెందిన నదీముల్లా తోపుడుబండ్లపై కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడితో తబస్సుంకు పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర బంధానికి దారితీసింది. విషయం అల్లాబక్‌షకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నాడని భావించిన ఆమె.. భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఆ మేరకు ఈనెల 18న తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న అల్లాబకష్ గొంతుకు చున్నీతో బిగించి, ఊపిరాడకుండా చేసింది. అందుకు ప్రియుడు సహకరించాడు. అల్లాబకష్ చనిపోయాడని నదీముల్లా అక్కడి నుంచి పరాయ్యాడు. కొద్దిసేపటి తరువాత అల్లాబకష్ సోదరికి తబస్సుం ఫోన చేసి, ‘మీ అన్న ఆరోగ్యం సరిగాలేదనీ, వెంటనే రావాల’ని చెప్పింది. వారు వచ్చి చూసి, అనుమానం రావడంతో నిలదీశారు. దీంతో ఆమె నేరాన్ని ఒప్పుకుంది. అల్లాబకష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఆ మేరకు తబస్సుం, నదీముల్లాను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.