Share News

ఖనిజం నిగ్గుతేలేనా..?

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:28 AM

ఖనిజ రవాణాకు సంబంధించిన పర్మిట్‌ పేపర్లలో టెక్నాలజీని ఉపయోగించి మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వ ఆదాయానికి కొందరు మైనింగ్‌ యజమానులు, ఎండీఎల్‌ ట్రేడర్లు భారీగా గండికొడుతున్నారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన ఒక మైనింగ్‌ యజమానికి చెందిన మూడు డోలమైట్‌ అక్రమ రవాణా లారీలను ఇటీవల ...

ఖనిజం నిగ్గుతేలేనా..?
Officials measuring mineral reserves at Srinivasa Minerals Crushers (File)

అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి

కర్నూలు జిల్లాలో పట్టుబడడంతో వెలుగులోకి

వివరాలు వెల్లడించని అధికారులు

యాడికి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఖనిజ రవాణాకు సంబంధించిన పర్మిట్‌ పేపర్లలో టెక్నాలజీని ఉపయోగించి మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వ ఆదాయానికి కొందరు మైనింగ్‌ యజమానులు, ఎండీఎల్‌ ట్రేడర్లు భారీగా గండికొడుతున్నారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన ఒక మైనింగ్‌ యజమానికి చెందిన మూడు డోలమైట్‌ అక్రమ రవాణా లారీలను ఇటీవల కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రీజనల్‌ విజిలెన్స అధికారులు పట్టుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. డోలమైట్‌ ఖనిజ అక్రమ రవాణాపై అప్రమత్తమైన కర్నూలు విజిలెన్స అధికారులు యాడికి మండలం దైవాలమడుగు గ్రామం వద్ద సదరు గని వద్ద డోలమైట్‌ ఖనిజ నిల్వలను, శ్రీనివాస మినరల్స్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఎంత మొత్తంలో డోలమైట్‌ ఖనిజం అక్రమ రవాణా జరిగిందో నివేదికలు తయారు చేయడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈనెల 18, 19తేదీల్లో రికార్డులు, ఖనిజం నిల్వలను పరిశీలించారు. డోలమైట్‌ ఖనిజం అక్రమ రవాణాపై ఏమి చర్యలు తీసుకున్నది ఇంతవరకూ అధికారులు వెల్లడించలేదు.

ఏమిటీ ఎండీఎల్‌..?

ఖనిజ రవాణాకు సంబంధించి మినరల్‌ డీలర్‌ లైసెన్స (ఎండీఎల్‌) పొందాల్సి ఉంటుంది. వీటిని మైన్స అండ్‌ జియాలజీ అధికారుల నుంచి పొందాలి. ఫ్యాక్టరీల యజమానులే కాకుండా ట్రేడర్స్‌ కూడా ఎండీఎల్‌లు


తీసుకొని ముడి, పొడి ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా విక్రయాలు చేయవచ్చు, ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు రవాణాచేసే సమయంలో రవాణా చేసే వాహనం ట్రాన్షిట్‌ ఫాంను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రాన్షిట్‌ ఫాంలో రవాణా చేసే ఖనిజం వివరాలు, తేది, సమయం, క్యూఆర్‌కోడ్‌ ఉంటుంది. ఖనిజాన్ని అక్రమ రవాణా చేసే ఖనిజ టన్నేజీని మార్పు చేసి దందాను కొనసాగిస్తున్నారు. ట్రాన్షిట్‌ ఫాంలో పదుల సంఖ్యలో ఉన్న టన్నేజీని సింగిల్‌ డిజిట్‌లోకి మార్చేస్తున్నారు. రాయల్టీ అధికారులను బురిడి కొట్టిస్తూ యథేచ్ఛగా ఖనిజ అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారు.

ఎలా మార్పు చేస్తున్నారంటే..

ఉదాహరణకు ట్రాన్షిట్‌ ఫాంలో 35 టన్నులకు తీసుకొని దానిని 3.5 టన్నులుగా మార్పు చేసుకుంటున్నారు. ట్రాన్షిట్‌ ఫాంలో 30 టన్నులు ఉంటే దానిని 3.0 టన్నులుగా మార్పు చేస్తున్నారు. ట్రాన్షిట్‌ ఫాంలో మార్పు చేసుకున్న విధంగా కేవలం 3 టన్నులకు మాత్రమే రాయల్టీ చెల్లించి మిగిలిన టన్నేజీకి రాయల్టీని ఎగ్గొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా కోట్ల రూపాయల రాయల్టీని ఎగవేస్తున్నారు.

పట్టుబడ్డారిలా..

యాడికి మండలం దైవాలమడుగు గ్రామం వద్ద శ్రీనివాస మినరల్స్‌ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్దకు డోలమైట్‌ ఖనిజ రవాణా వాహనాలను కర్నూలు రీజనల్‌ విజిలెన్స అధికారులు తనిఖీ చేయడంతో అక్రమ ఖనిజ రవాణా దందా వెలుగులోకి వచ్చింది. వాహనాల్లో తరలుతున్న ఖనిజ టన్నేజీకి, ట్రాన్షిట్‌ ఫాంలో ఉన్న టన్నేజీకి వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో మూడులారీలను సీజ్‌ చేశారు. అనంతరం తాడిపత్రి మైన్స అండ్‌ జియాలజీ అధికారులతో కలిసి శ్రీనివాస మినరల్స్‌ వద్దకు వచ్చారు. మైన్స వద్ద నిల్వచేసిన ఖనిజాన్ని కొలతలు వేసి రికార్డులను పరిశీలించడంతో దందా వెలుగులోకి వచ్చింది.

నివేదిక ఆధారంగా చర్యలు

దైవాలమడుగు గ్రామం వద్ద శ్రీనివాస మినరల్స్‌ నుంచి డోలమైట్‌ ఖనిజం అక్రమ రవాణా జరుగుతున్నట్లు కర్నూలు విజిలెన్స అధికారులు గుర్తించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఖనిజ నిల్వలపై సర్వేచేశారు. కర్నూలు విజిలెన్స అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టాలనేది తేలుతుంది. ఖనిజం అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు తప్పవు.

-ఓబులరెడ్డి, ఏడీఏ, గనులు భూగర్భవనరుల శాఖ, తాడిపత్రి

Updated Date - Aug 25 , 2025 | 12:28 AM