Share News

Rain : వరదొస్తే.. వాకిట్లోకే..!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:28 AM

విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను చూసి ఇదేదో చిన్న పంట కాలువ నుకుంటే తప్పులో కాలేసినట్లే. అనంత నగరంలోనే పెద్దదైన నడిమివంక. రజకనగర్‌లో ఇలా కుంచించుకపోయి, గుర్రపు డెక్క పెరిగిపోయి, పూడిక పేరుకుపోయి నీరు ముందుకు కదిలే అవకాశమే కనిపించట్లేదు. ఈ వంక ...

Rain : వరదొస్తే.. వాకిట్లోకే..!
A median filled with overgrown plants and garbage in Rajakanagar

ప్రధాన వంకల్లో పేరుకుపోయిన పూడిక..

పెరిగిపోయిన కంపచెట్లు

ఆక్రమణలతో కుంచించుకుపోయిన వైనం

నగర వాసులను వెంటాడుతున్న ముంపు భయం

శాశ్వత పరిష్కారం పట్టని పాలకులు, అధికారులు

విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను చూసి ఇదేదో చిన్న పంట కాలువ నుకుంటే తప్పులో కాలేసినట్లే. అనంత నగరంలోనే పెద్దదైన నడిమివంక. రజకనగర్‌లో ఇలా కుంచించుకపోయి, గుర్రపు డెక్క పెరిగిపోయి, పూడిక పేరుకుపోయి నీరు ముందుకు కదిలే అవకాశమే కనిపించట్లేదు. ఈ వంక వరద కాలనీలు కాలనీలనే గతంలో ముంచెత్తింది. ప్రస్తుతం కురుస్తున్న


వర్షాలకు వరద వస్తే.. పరిస్థితిని ఊహించుకుంటేనే భయమేస్తోందని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. వర్షాకాలంలో కూడా పాలకులు, అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ప్రధాన వంకల్లో పూడిక పేరుకుపోయి, కంపచెట్లు పెరిగిపోయి నీరు ముందుకు కదలలేని దుస్థితి నెలకొంది. మురుగునీటి వ్యవస్థ కూడా లేకపోవడంతో ఏటా వర్షకాలంలో వంకలకు వరద పోటెత్తడం, ఇల్లు మునగడం పరిపాటిగా మారింది. ఏళ్లుగా ఇదే దుస్థితి. నగరవాసులు సర్వం కోల్పోయి కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా.. వంకల్లో నీరు వెళ్లేలా కనీస చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. దీంతో నగర వాసులను ముంపు భయం వెంటాడుతోంది. నరగంలో ప్రధానమైన నడిమివంక, మరువవంకలపై ఆక్రమణలను తొలగించి, విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

భయం.. భయం..

నడిమి వంక, మరువ వంక, పండమేరు వంకలతో పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. పాతూరు, కమలానగర్‌, రామ్‌నగర్‌, వేణుగోపాల్‌ నగర్‌, హెచ్చెల్సీ కాలనీ, ఆరోరోడ్డు, ఆజాద్‌నగర్‌, హౌసింగ్‌బోర్డు, అశోక్‌నగర్‌, సాయినగర్‌, సంగమేష్‌ నగర్‌, రజకనగర్‌, గంగానగర్‌, సోమనాథ్‌నగర్‌, ఆర్‌కే నగర్‌, రామచంద్రనగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. ప్రధాన రహదారులను సైతం వాగులను తలపించేలా వర్షపు నీరు ముంచెత్తుతోంది.

వర్షం వచ్చిందంటే ఆయా కాలనీల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 2022లో వచ్చిన వరదలకు నడిమి వంక ఉగ్రరూపం దాల్చింది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఆ భయాలు జనాలను వెంటాడుతూనే ఉన్నాయి.

మురుగు కాలువలు విస్తరించాలి: బాషా, అశోక్‌నగర్‌

అశోక్‌నగర్‌లో మరువవంక కుంచించుకుపోయింది. మరుగు, వర్షపు నీరు రోడ్డుమీదికి వస్తోంది. వర్షం పడిందో అశోక్‌నగర్‌ బ్రిడ్జి దగ్గర నుంచి అంబేడ్కర్‌ భవన వరకు మడుగులా మారుతుంది. చాలాసార్లు అధికారులకు కష్టాలు చెప్పాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. మరువవంకతోపాటు డ్రైనేజీ కాలువలను విస్తరించాలి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది.

ఆక్రమణలను ఉపేక్షించేది లేదు

వర్షాకాలంలో వరద ప్రభావాన్ని తగ్గించడంపై దృష్టి సారించాం. నడిమివంక, మరువవంకలో ఆక్రమణలను తొలగించుకోవాలని సూచించాం. నోటీసులు జారీ చేస్తున్నాం. మురుగుకాలవలపై నిర్మించిన కట్టడాలను కూడా గుర్తించి, సంబంధికులకు నోటీసులు ఇస్తున్నాం. వర్షం పడితే నీరంతా మరువవంక, నడిమివంక ద్వారా వెళ్లిపోయేలా చూస్తాం.

- బాలస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్‌

చినుకుపడితే సమస్యలు తప్పవు - మాధవి, రజకనగర్‌

వర్షం పడితే ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టాలంటే భయంగా ఉంటుంది. రజకనగర్‌ నుంచి నగరంలోకి వెళ్లాలంటే చెరువులను తలపించే రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. రెండు, మూడు నెలలపాటు నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది. నీటి నిల్వ కారణంగా దోమలు వ్యాప్తి చెంది, పందులు సంచరించి రోగాలబారిన పడుతున్నాం. వాన నీరు కాలువల్లో వెళ్లిపోయేలా మురుగు కాలువలు, నడిమివంకను విస్తరించాలి.

అధికారులు కన్నెత్తి చూడరు: గౌస్‌బాషా, సాయినగర్‌

వర్షపు నీటితో మేం పడుతున్న ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావట్లేదు. వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నా ఎవరూ పట్టించుకోరు. మరువవంక సమస్య పరిష్కరిస్తే మురుగు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెళ్లిపోతుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఫలితం లేదు.

Updated Date - Aug 17 , 2025 | 12:28 AM