Share News

Land : భూచోళ్లు..!

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:02 AM

పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని మాయతో కాజేసేందుకు కొన్ని గుంట నక్కలు కాచుకుకూర్చున్నాయి. ఈక్రమంలోనే అనసెటిల్డ్‌ భూములపై కన్ను వేశాయి. లేని వారసులను పుట్టించి పరిహారాన్ని ఫలహారం ..

Land : భూచోళ్లు..!
Lands being acquired for industries at Tekulodu

భూ పరిహారం కోసం మాయగాళ్ల ఎత్తులు

  • టేకులోడు సెజ్‌లో అనసెటిల్డ్‌ భూములపై కన్ను

  • లేని వారసులను సృష్టించే ప్రయత్నం

  • 50 ఎకరాల వరకు అపరిష్కృత భూములు

  • దళారులకు ఇద్దరు అధికారుల సహకారం

చిలమత్తూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని మాయతో కాజేసేందుకు కొన్ని గుంట నక్కలు కాచుకుకూర్చున్నాయి. ఈక్రమంలోనే అనసెటిల్డ్‌ భూములపై కన్ను వేశాయి. లేని వారసులను పుట్టించి పరిహారాన్ని ఫలహారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మండలంలోని టేకులోడు రెవెన్యూ గ్రామంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ జరుగుతోంది. రైతులు సాగు చేసుకుంటున్న 600 ఎకరాల అసైన్డ భూములను సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు వారికి పరిహారం అందించి, భూసేకరణ ప్రారంభించింది. అయితే ఈ 600 ఎకరాల్లో 24 మంది రైతులకు సంబంధించి సుమారు 50 ఎకరాలు చాలా కాలంగా అనసెటిల్డ్‌గా (అపరిష్కృతంగా) ఉండిపోయింది.

అనసెటిల్డ్‌ భూములపైనే కన్ను

2014-2019 మధ్య కాలంలో టేకులోడు రెవెన్యూ గ్రామంలో టి-హబ్‌ కోసం 200 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఆ సమయంలో అనసెటిల్డ్‌ భూముల విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ప్రభుత్వం టేకులోడు రెవెన్యూ పొలంలో సర్వే నంబర్‌ 1-10లో 2.32, సర్వేనంబర్‌ 1-16లో 2.37 ఎకరాలను అసైన్డ పట్టాగా ఇచ్చింది. అప్పట్లో ఈ భూమిని భూసేకరణలో తీసుకున్నారు. అయితే భూసేకరణ చేపట్టే సమయానికి భూయజమాని, అతని భార్య ఇద్దరు మృతి చెంది ఉన్నారు. వారికి రక్తసంబంధీకులు కూడా ఎవరూ లేకపోవడంతో ఆ భూమి అనసెటిల్డ్‌ భూమిగా ఉండిపోయింది. దీనిని గుర్తించిన కొందరు దళారులు ఆ భూముకి వారసులుగా నకిలీ


వ్యక్తులను తెరపైకి తీసుకువచ్చారు. మృతి చెందిన భూ యజమాని రెండో భార్యగా ఒక మహిళను తెరపైకి తెచ్చారు. అధికారుల సాయంతో అనసెటిల్డ్‌గా ఉన్న ఆ భూమికి ఆ మహిళను వారసురాలుగా ధ్రువీకరింపజేసి ఆమె పేరుతో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయించారు. అనంతరం ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 30,48,500ల భూపరిహారాన్ని ఖాతాలో పడేటట్లు చేశారు. అలా పడిన మొత్తాన్ని దళారుల ఖాతాల్లోకి జమచేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు కూడా ఇదే రీతిలో అనసెటిల్డ్‌ భూముల్లో అవకతవకలకు పాల్పడి కోట్ల రూపాయలను కాజేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

50 ఎకరాల వరకు అనసెటిల్డ్‌ భూమి

టేకులోడులో పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూముల్లో సుమారు 50 ఎకరాల వరకు అనసెటిల్డ్‌ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ భూములను చాలా కాలం క్రితమే రైతులు ఇతరులకు విక్రయించారు. అయితే అసైన్డ భూములు రిజిస్ట్రేషన కాకపోవడంతో అప్పట్లో భూములు కొన్నవారు నానడాక్యుమెంట్‌లో రాసుకున్నారు. దీంతో భూమి సాగుచేసుకుంటున్నా భూయాజమాన్య హక్కులు పొందలేకపోయారు. అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారాలు కాకపోవడం, అసలైన పట్టాదారుడు లేకపోవడం వంటి కారణాలతో 50 ఎకరాల భూములు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ భూములపై కన్నేసిన కొందరు అసలైన భూ యజమానుల స్థానంలో నకిలీ వ్యక్తులను తెరపైకి తీసుకువచ్చి భూపరిహారం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కీలక వ్యవహారంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

విచారణ తరువాతే పరిహారం

టేకులోడు గ్రామంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో నిజమైన భూ యజమానులకే ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 600 ఎకరాల భూసేకరణలో 50 ఎకరాల వరకు అనసెటిల్డ్‌గా ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టాం. ఎవరు నిజమైన భూయజమాని అనే విషయాలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తరువాతే పరిహారానికి అమోదం తెలుపుతాం. అనసెటిల్డ్‌గా ఉన్న భూములకు సంబంధించి రైతులు తమ వద్ద ఉన్న రికార్డులను తీసుకువస్తే పరిశీలన జరిపి, వారు నిజమైన భూహక్కుదారులా కాదా అనే విషయాలను నిర్ధారణ చేస్తాం. చేపట్టిన భూసేకరణలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నాం. సమస్యలు లేని 200 ఎకరాలకు ఇప్పటి వరకు పరిహారం అందజేశాం. గతంలోలా అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

-నటరాజు, తహసీల్దార్‌, చిలమత్తూరు మండలం

Updated Date - Aug 13 , 2025 | 01:02 AM