Share News

దళారీలే డాక్టర్లు..!

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:20 AM

లింగమయ్య... యాడికి వాసి. రెండు కాళ్లు లేవు. ఏమాత్రం నడవలేడు. మూడు చక్రాల కుర్చీకే పరిమితం. అయినా అధికారులు వైకల్యశాతం పునఃపరిశీలన చేసుకోవాలని నోటీసు పంపారు. ఆ మేరకు వెళ్లిన లింగమయ్యకు వింత అనుభవం ఎదురైంది. గతంలో 90 శాతం వైకల్యం ఉన్న లింగమయ్యకు పునఃపరిశీలనలో 80 శాతమే ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో ఆయనకు వచ్చే...

దళారీలే డాక్టర్లు..!

వైకల్య పునఃపరిశీలనలో ఇష్టారాజ్యం

పైసలకొద్దీ పర్సెంటేజీ..

ఇచ్చుకున్నోళ్లకు అధిక శాతం

కాసులివ్వని అర్హులకు అన్యాయం

లబోదిబోమంటున్న బాధితులు

కళ్లు మూసుకున్న ఉన్నతాధికారులు

లింగమయ్య... యాడికి వాసి. రెండు కాళ్లు లేవు. ఏమాత్రం నడవలేడు. మూడు చక్రాల కుర్చీకే పరిమితం. అయినా అధికారులు వైకల్యశాతం పునఃపరిశీలన చేసుకోవాలని నోటీసు పంపారు. ఆ మేరకు వెళ్లిన లింగమయ్యకు వింత అనుభవం ఎదురైంది. గతంలో 90 శాతం వైకల్యం ఉన్న లింగమయ్యకు పునఃపరిశీలనలో 80 శాతమే ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో ఆయనకు వచ్చే పింఛన సొమ్ము రూ.15వేల నుంచి రూ.6వేలకు తగ్గిపోయింది. బుధవారం యాడికి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యాడు. రెండుకాళ్లులేని తనలాంటి వాడికేనా ఇలా చేసేది అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. అధికారులు మరలా పునఃపరిశీలనకు పంపాలని కోరుతూ వినతిపత్రం అందజేశాడు.

యాడికి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పింఛన లబ్ధిదారుల వైకల్య పునఃపరిశీలనలో దళారీల హవా నడిచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులిచ్చినోళ్లు అనర్హులైనా లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. కాసులివ్వకపోతే అర్హులకు సైతం అన్యాయం చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్‌ఎంపీలు, రాజకీయ పార్టీల నాయకులు దళారీల అవతారమెత్తి పైసలిచ్చిన వారందరికీ లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. పైసలు ముట్టజెప్పినోళ్లు జస్ట్‌.. అలా.. వైద్యుడి గదిలోకి వెళ్లి వస్తే చాలు.. అని దళారీలు చెప్పినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.


వైద్యులతో కుమ్మక్కై దందా సాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నష్టపోయిన బాధితులు పదుల సంఖ్యలో తమకు న్యాయం చేయాలంటూ బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు.

300 మందికిపైగా..

మండలంలో 300 మందికిపైగా వైకల్య పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి లబ్ధిదారులకు నోటీసులు వెళ్లాయి. తమకు కేటాయించిన తాడిపత్రి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య పునఃపరిశీలనకు వెళ్లారు. అక్కడ ఏమి మతలబు జరిగిందో, ఏమోగానీ ఎంతో మంది అర్హులైన లబ్ధిదారులకు వైకల్యశాతం తగ్గిపోయింది. దీంతో అర్హులైన కొంతమంది పింఛన కోల్పోవాల్సి వచ్చింది. రూ.15వేలు పింఛన తీసుకుంటున్న మరికొంతమంది లబ్ధిదారులు రూ.6 వేలు తీసుకోవాల్సి వస్తోంది. డబ్బులతో వైకల్యశాతం వేయించుకున్న అనర్హులు మాత్రం దర్జాగా పింఛన పొందుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఆస్పత్రుల్లో దళారుల వసూళ్లు

వైకల్య పునఃపరిశీలనను ఆసరాగా చేసుకొని కొందరు దళారుల అవతారం ఎత్తారు. యాడికిలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద క్లినిక్‌ నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ, చిక్కేపల్లిలో నాయకుడిగా చెలామణి అవుతున్న మరో వ్యక్తి వైకల్య పునఃపరిశీలనలో డాక్టర్లతో తాము మాట్లాడతామనీ, జస్ట్‌ డాక్టర్‌ గదిలోకి వెళ్లి వస్తే చాలు అనీ, గతంలో ఉన్న వైకల్య పర్సంటేజీ వచ్చేలా చేస్తామంటూ డబ్బులు లాగారు. పునఃపరిశీలనకు వెళ్లిన ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు దళారులు వసూలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. మామూలు ముట్టజెప్పని వారికి మాత్రం పింఛన కోల్పోయేలా వైకల్యశాతం తగ్గించేటట్లు చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తగు చర్యలు చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

వీటిని ఏమంటారు?

- చిక్కేపల్లికి చెందిన ఒక వ్యక్తి ఎటువంటి అంగవైకల్యం లేకపోయినా దివ్యాంగ సర్టిఫికెట్‌తో పింఛన పొందుతున్నాడు. పునఃపరిశీలనకు వెళ్లిన సమయంలో అక్కడ దళారీకి రూ.30వేలు ముట్టజెప్పి, మరలా వైకల్య సర్టిఫికెట్‌ వచ్చేలా చేసుకున్నాడు. దీంతో అతడి పింఛన యథాతథంగా వస్తోంది.

- యాడికికి చెందిన మరో వ్యక్తి కేవలం కాలు విరిగిందని సాకు చూపుతూ వైకల్య సర్టిఫికెట్‌తో పింఛన పొందాడు. అతడు కూడా వైకల్యం లేకుండా పరిశీలనకు వెళ్లిన సమయంలో దళారులకు ముడుపులు అప్పజెప్పడంతో సర్టిఫికెట్‌ యథాతథంగా పొందాడు.

- యాడికికి చెందిన మరో వ్యక్తి తనకు చెవుడు ఉన్నట్లు వైకల్య సర్టిఫికెట్‌ పొంది పింఛన తీసుకుంటున్నాడు. ఇతడి వైకల్యం కూడా పరిశీలనకు పంపిన దళారులకు రూ.25 వేలు ముట్టజెప్పి సర్టిఫికెట్‌ పునరుద్ధరించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనర్హులు ఎంతోమంది పింఛన పొందుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

డీఆర్‌డీఏ పీడీకి నివేదిస్తాం

సుమారు 40మంది లబ్ధిదారులు వైకల్యపునఃపరిశీలనలో తమకు అన్యాయం జరిగిందని వినతిపత్రాలు అందజేశారు. వారి అభ్యర్థన మేరకు వైకల్య పునఃపరిశీలనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ డీఆర్‌డీఏ పీడీకి నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

-వీరరాజు, ఎంపీడీఓ, యాడికి

Updated Date - Aug 21 , 2025 | 12:20 AM