Share News

ఆటోవాలాల ఆగడాలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:27 AM

స్థానిక రైల్వే స్టేషనలో ఆటోవాలాలు.. ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పక్కనే ఉన్న ప్రాంతాలకు సైతం వందలు డిమాండ్‌ చేస్తున్నారు. రైళ్లలో వచ్చే.. ఇతర రాషా్ట్రల కూలీలు టమోటా మార్కెట్‌కు వెళ్లాలంటే ఏకంగా మనిషికి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు. అంతనా.. అంటే... దుర్భాషలాడుతున్నారు. ...

ఆటోవాలాల ఆగడాలు
Auto drivers at a stand arguing with auto rickshaw drivers on the road

రైల్వేస్టేషనలో అడిగినంత ఇచ్చుకోవాల్సిందే..

వద్దంటే.. దుర్భాషలు..

రాత్రిళ్లు వేలల్లో అడుగుతున్న వైనం

బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

నిద్రమత్తులో నిఘా యంత్రాంగం

అనంతపురం న్యూటౌన, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషనలో ఆటోవాలాలు.. ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పక్కనే ఉన్న ప్రాంతాలకు సైతం వందలు డిమాండ్‌ చేస్తున్నారు. రైళ్లలో వచ్చే.. ఇతర రాషా్ట్రల కూలీలు టమోటా మార్కెట్‌కు వెళ్లాలంటే ఏకంగా మనిషికి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు. అంతనా.. అంటే... దుర్భాషలాడుతున్నారు. బయటికొచ్చి వేరే ఆటోలో వెళ్దామంటే అక్కడకీ వచ్చేసి గొడవ పడుతున్నారు. వారి తీరుతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. వారిని కట్టడి చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

ఉదయం భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ అనంత రైల్వేస్టేషనకు వస్తుంది. అరగంట వ్యవధిలోనే న్యూడిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే కేకే ఎక్స్‌ప్రెస్‌ కూడా వస్తుంది. ఈ రెండు రైళ్లలో వచ్చే వారిలో ఎక్కువగా కొత్తవారే ఉంటారు. అలాంటివారు ఆటో అడిగితే వందలు, వేలు డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.. వారి ఆటోలోనే వెళ్లాల్సిందే. లేదంటే వేరే ఆటోలో వెల్లనివ్వరు. దీంతో తోటి ఆటోడ్రైవర్లతోపాటు


ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అంత అద్దె ఏంటంటూ వెళ్లిపోతుంటే.. నానా దుర్భాషలాడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘ఆస్తులు అడిగామా..’ అంటూ ప్రారంభించి నానా దుర్భాషలాడుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషనలో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన జీఆర్‌పీఎఫ్‌, ఆర్ఫీఎఫ్‌ సిబ్బంది ఎక్కడుంటారో కూడా తెలీదన్న విమర్శలున్నాయి.

వద్దంటే.. దుర్భాషలే..

మూడు రోజుల క్రితం ఉదయం 6.30 గంటల సమయంలో రైల్వే స్టేషన ముందు వెళ్తున్న మహిళా ప్రయాణికులపై ఆటోవాలా ఒకరు ఆనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. భర్తతో కలిసి వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆటోవాలాలు అడిగినంత ఇవ్వకపోవడంతో బేరం అడిగినందుకు ఇలాంటి పరిస్థితులు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ఉదయం పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఓ జేఈఈ తమ ఉన్నతాధికారులు భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రె్‌సలో వస్తుండటంతో వారిని రిసీవ్‌ చేసుకోవడానికి స్టేషనకు వెళ్లారు. రైలు దిగిన వెంటనే వారిని స్టేషన బయటకు తీసుకొచ్చి ఆటోలో వెళ్లే ప్రయత్నం చేశారు. బస్టాండు దగ్గరలోని ప్రాంతానికి వెళ్లాలని చెప్పడంతో 100 ఇవ్వాలన్నారు ఆటోవాలాలు. దగ్గరే కదా.. అని స్థానిక పీఆర్‌ ఉద్యోగి అనడంతో ‘మీ ఆస్తులు ఏమైనా అడిగామా?’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆటోవాలాలు ముందుకెళ్లారు. అనంతరం టమోటా మార్కెట్‌కు వెళ్లాలని కూలి పనులకోసం వచ్చిన యువతను టార్గెట్‌ చేశారు. టమోటా మార్కెట్‌కు తీసుకెళ్లాలంటే మనిషికి వెయ్యి రూపాయలు అని ఆటోవాలా చెప్పడంతో యువత ఏమి చేయాలో అర్థంకాక కొంత ముందుకెళ్లారు.

బేరానికి అడ్డు తగిలితే దాదాగిరీ..

రైల్వే స్టేషన ఆవరణలో ఉన్న ఆటోస్టాండులో ఉన్న ఆటోవాలాల బేరానికి అడ్డు తగిలితే దాదాగిరీకి దిగుతున్నారన్న విమర్శలున్నాయి. నగరంపై అవగాహన ఉన్నవారు ముఖద్వారం వద్ద ఆటో ఎక్కకుండా రూ.20కే వెళ్లవచ్చన్న ఉద్దేశంతో బయటకు వెళ్లి ఆటో ఎక్కే ప్రయత్నం చేస్తే.. ఆటోస్టాండ్‌లో ఉన్న ఆటోవాలాలు దాదాగిరీకి దిగుతున్నారన్న చర్చ సాగుతోంది. అవగాహన ఉన్నవారు రైలు దిగి ఆనలైనలో ఆటో బుక్‌ చేసుకున్నారు. ఆ ఆటో డ్రైవర్‌ స్టేషన ముందుభాగంలో ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా స్టాండ్‌లో ఉన్న ఆటోవాలాలు అతడిపై దౌర్జన్యానికి దిగారు. ఆటోవాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రైల్వే పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం

సిబ్బంది కొరతతో కొంత ఇబ్బందిగా ఉంది. తగిన భద్రత చర్యలు చేపడుతున్నాం. స్టేషన భవనాలు నిర్మాణంలో ఉన్నందున భద్రత కల్పించడం కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఉన్నవారితోనే ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం. ఆటో స్టాండ్‌ విషయం మా పరిధిలోకి రాదు. త్రీటౌన పోలీసులు చూసుకుంటారు.

-సుధాకర్‌రావు, ఆర్పీఎఫ్‌ ఇనస్పెక్టర్‌

Updated Date - Aug 23 , 2025 | 12:27 AM