CROP: మొక్కజొన్న సాగుపై అన్నదాత ఆసక్తి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:29 AM
రబీసీజనలో విరివిగా వరిసాగుచేసే రైతన్నలు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి సాగుకు ఖర్చులు భారం కావడంతోనే మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన మొదలుకాగానే బీపీటీ, సోనామసూరీ రకం వరిపైర్లు సిద్ధం చేసేవారు.
వరి పంటను వదిలేస్తున్న వైనం..
పెనుకొండ రూరల్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రబీసీజనలో విరివిగా వరిసాగుచేసే రైతన్నలు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి సాగుకు ఖర్చులు భారం కావడంతోనే మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన మొదలుకాగానే బీపీటీ, సోనామసూరీ రకం వరిపైర్లు సిద్ధం చేసేవారు. వరికి ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేలు ఖర్చవుతోంది. మార్కెట్‌లో బీపీటీ సోనామసూరీ రకం క్వింటాల్ రూ.4000నుంచి రూ.4200ధరలు పలకడంతో పెట్టిన పెట్టుబడికూడా అందదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఖరీఫ్ సీజనలో మొక్కజొన్న సాగువైపు రైతులు ఆసక్తిచూపుతున్నారు. కొన్నేళ్లుగా మొక్కజొన్న క్వింటాల్ ధర రూ.2,200పలకగా ఎకరాకు 35నుంచి 40క్వింటాళ్లు దిగుబడులు రావడంతో ఈ పంటనే వేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజనలో పెనుకొండ, రొద్దం మండలాల్లో 3వేల ఎకరాలకుపైగా సాగుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెనుకొండ మండలవ్యాప్తంగా రబీ సీజన ప్రారంభంలో 900 హెక్టార్లకుపైగా మొక్కజొన్న పంట సాగుచేశారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో మొక్కజొన్న సాగుచేస్తూ అధిక దిగుబడి సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కజొన్నసాగు రైతులకు ఎంతో మేలు
పొలంలో విత్తు విత్తినప్పటి నుంచి 130 రోజులకే మొక్కజొన్న పంట పండుతుంది. వ్యవసాయాధికారుల సలహాతో నాకున్న రెండెకరాల్లో రెండేళ్ల నుంచి మొక్కజొన్న పంటను సాగుచేస్తున్నా. పంట వేసినప్పటి నుంచి ఎకరాకు 35క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాల్ రూ.2500పలుకుతోంది. ధరలు నిలకడగా ఉంటే మంచి ఆదాయం వస్తుంది.
- శ్రీనివాసరెడ్డి, రైతు, కోనాపురం
పెట్టుబడిపోను రూ.లక్ష ఆదాయం
గతంలో వరిపంటసాగుచేసి తీవ్రంగా నష్టపోయాం. వరిసాగుతో పెట్టుబడులు కూడా రాలేదు. రబీ సీజనలో నాకున్న 2.10ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశా. 70క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పెట్టుబడిపోను రూ.లక్ష ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కూడా మొక్కజొన్న సాగుచేశాను.
- చలపతి, రైతు, కోనాపురం
సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు
మొక్కజొన్న సాగుచేసే రైతులు ముందుగా నేల స్వభావంబట్టి పశువుల ఎరువులు, కాంపోస్ట్ జిప్సం తదితర ఎరువులు వాడాలి. నేలను రెండు లేదా మూడుసార్లు దుక్కిదున్ని రొటావేటర్ వేయాలి. విత్తనం విత్తిన 20రోజులకు కలుపు నివారణ కోసం అట్రాసిన 0.25 మి.లీ. మందును పిచికారి చేయాలన్నారు. పచ్చపురుగు ఆశించినట్లయితే ఎకరాకు 8ఎంఎల్ క్లోరోటానిల్ ప్రోల్, సీయోమోటోస్కాం 0.4ఎంఎల్ నీటిలో కలుపుకుని పిచికారి చేయాలి. 25రోజుల తరువాత యూరియా కాంప్లెక్స్, డీఏపీ, పొటాష్ ఎరువులు వాడితే మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు.
- చందన, ఏఓ, పెనుకొండ